సిటీబ్యూరో, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): సైబర్‌నేరాల్లో పోతుంది కొండంత అయితే.. రికవరీ మాత్రం గోరంతగా ఉంటున్నది. జీరో అవర్‌లో కాల్ చేయలేదంటే.. మేం ఏం చేయలేమన్నట్లు సైబర్‌క్రైమ్ పోలీసులు వ్యవహరిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో దేశవ్యాప్తంగా తెలంగాణ సైబర్‌క్రైమ్ పోలీసులు హడల్ ఎత్తించేవారు. వేగంగా కేసుల నమోదుతో పాటు నేరగాళ్లు ఎక్కడున్నా వాళ్ల ఆటకట్టించేవారు. నేడు ఆ పరిస్థితి లేదు. సైబర్‌నేరగాళ్లు రోజుకో కొత్తపంథాల్లో దోచుకుంటున్నా.. కేసుల నమోదుతోనే పోలీసులు సరిపుచ్చుతున్నారు. దర్యాప్తులోనూ వేగం తగ్గింది. బాధితుల డబ్బులు రికవరీ విషయంలో 1930పైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. రూ. కోట్లు పోతున్నా..రికవరీలు మాత్రం వేలల్లోనే ఉంటున్నాయి.
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్లలోని సైబర్‌క్రైమ్ పోలీస్స్టేషన్లలో ఈ ఏడాది మొదటి ఏడు నెలల్లో సుమారు 5 వేల వరకు కేసులు నమోదయ్యాయి. వీటికి ఆయా శాంతి భద్రతల పోలీస్స్టేషన్లలో నమోదయ్యే కేసులు అదనం. ఇందులో 2 వేల వరకు సోషల్‌మీడియా, ఇతరాత్ర ఉన్నా.. 3 వేల వరకు మాత్రం ఆర్థికంగా నష్టం జరిగిన కేసులు నమోదయ్యాయి. ట్రై కమిషనరేట్ల పరిధిలో ప్రతి నెల రూ. 20 కోట్ల నుంచి రూ. 25 కోట్లు వరకు నష్టం జరుగుతున్నది. ఇందులో ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, ఫెడెక్స్, ట్రేడింగ్ మోసాల్లో ఎక్కువగా నష్టం వాటిల్లుతున్నది.
సైబర్‌నేరాలు జరిగిన వెంటనే జీరో అవర్‌లో 1930కి, నేషనల్ సైబర్‌క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేస్తే.. పోయిన సొత్తు వెనక్కి వచ్చేందుకు అవకాశాలుంటాయి. బాధితులు పోర్టల్‌లో ఫిర్యాదు చేస్తే.. సైబర్ నేరగాళ్లకు సంబంధించిన బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ అయితే అదృష్టం. ఒకవేళ నిందితుల ఖాతాల్లో డబ్బు ఆగలేదంటే.. బాధితులకు నగదు రావడం గగనమే అవుతుంది. అయితే సైబర్‌క్రైమ్ పోలీసులు కూడా పూర్తిగా 1930పైనే ఆధారపడుతున్నారు.
సైబర్‌నేరం జరగగానే బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడం కేసు నమోదు చేసి పక్కన పడేయడం చేస్తుంటారు. ఇది పొరుగున ఉండే చాలా రాష్ర్టాల్లో గతంలో జరిగేది. కేసుల నమోదుతో పాటు రికవరీలో కూడా తెలంగాణ పోలీసులు గతంలో భేషుగ్గా పనిచేశారు. నేడు సమర్థులైన అధికారులున్నా.. తమకెందుకులే అన్న చందంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కొన్ని కేంద్రాల్లోని అధికారులకు సైబర్‌నేరాలపై అవగాహన లేకున్నా.. పోస్టింగ్‌లు ఇచ్చి కూర్చోబెడుతున్నారనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. సైబర్‌నేరాల్లో దొంగలు దొరికేది ఉందా? ఎవరో ఖాతాదారుడు మాత్రమే దొరుకుతాడు. ఇక మనం ఢిల్లీ, రాజస్థాన్‌కు వెళ్లి చేసేదేముందని కొందరు పోలీసులు వాదన వినిపిస్తున్నారు.