సిటీబ్యూరో, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): సీబీఐ, ఈడీ పేర్లతో పాటు సైబర్ నేరగాళ్లు బాధితులను భయపెట్టించడంలో 1930 నంబర్‌ను కూడా వాడుతూ అమాయకులను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. సైబర్ నేరాలు జరిగితే వెంటనే 1930కు ఫోన్ చేయాలని కేంద్రం సైబర్ బాధితుల కోసం ఈ టోల్ ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది. సైబర్‌నేరాలపై ఈ నంబర్‌కు ఫిర్యాదు చేయాలి. అయితే సైబర్‌నేరగాళ్లు ఈ నంబర్‌ను కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటూ మోసాలకు పాల్పడుతున్నారు. ఎక్కువగా డిజిటల్ అరెస్ట్‌లలో ఈ నంబర్‌ను నేరగాళ్లు వాడుతున్నారు. మోసమని అనుమానం వచ్చి సైబర్ పోలీసులకు చెబుతామంటూ.. బాధితులు చెబితే, ఆగండి 1930 నంబర్‌కు నేనే కలుపుతున్నానంటూ ఫోన్ నంబర్‌ను మరొకరికి కలిపి ‘సైబర్ పోలీసులం’ చెప్పండి అంటూ వివరాలు సైతం తీసుకుంటున్నారు.
ఎవరికీ చెప్పుకోవాలనే ఆలోచన..
‘ఫెడెక్స్ కొరియర్, ట్రాయ్ నుంచి మాట్లాడుతున్నాం..మీ ఫోన్ రెండు గంటల్లో బ్లాక్ అవుతుంది.. మేం సీబీఐ, ఈడీ నుంచి మాట్లాడుతున్నామం’టూ సైబర్‌నేరగాళ్లు ఫోన్ చేస్తారు. ఇలా ఫోన్ చేయగానే మీ ఫోన్ నంబర్, ఆధార్ కార్డుతో భారీగా లావాదేవీలు జరిగాయి.. మనీలాండరింగ్ కేసుతో ఈ నంబర్లకు సంబంధాలున్నాయి.. కేసు నమోదయ్యిందంటూ మాట్లాడుతారు. దీనికి సంబంధించిన విచారణ చేయాలి..మేం పోలీసులమంటూ పోలీసు దుస్తులతో వచ్చి బాధితులను డిజిటల్ అరెస్ట్ చేస్తారు. బాధితులతో కొంత సేపు ఆప్యాయతగా, మరికొంత సేపు భయపెడుతూ మాట్లాడుతారు. ఇలా సహాయం చేసేందుకు మేమే ఉన్నామని బాధితుల్లో ఒక నమ్మకాన్ని కుదిర్చి ఆ తరువాత బ్యాంకు ఖాతాలను లూఠీ చేస్తారు. ఇందులో ఎవరికైనా అనుమానం వచ్చి మేం సైబర్‌క్రైమ్ పోలీసులకు చెబుతాం, 1930కి ఫోన్ చేస్తామంటూ ఎవరైనా సైబర్ నేరగాళ్లతో మాట్లాడితే మీరు చెప్పడం ఎందుకు.. ఇప్పుడే సైబర్‌క్రైమ్ వాళ్లను లైన్లోకి తీసుకుందామంటూ వాళ్లే సైబర్ పోలీసులమంటూ మాట్లాడుతారు. ఇలా కొత్త రూట్లో సైబర్ నేరగాళ్లు బాధితులను బ్లాక్మెయిల్ చేస్తున్నారు.
బాధితులు జాగ్రత్త..
సైబర్‌నేరాల్లో మోసపోయిన వారి గురించి.. మోసగాళ్లకు తెలిసి ఉంటుంది. మోసపోయిన తరువాత 1930కు బాధితులు ఫోన్ చేస్తారు. దీనిని దృష్టిలో ఉంచుకొని సైబర్ నేరగాళ్లు మోసం చేసిన తరువాత కొన్ని రోజులకు బాధితులకు తిరిగి ఫోన్ చేసే అవకాశాలుంటాయి. మేం 1930 నుంచి మాట్లాడుతున్నామంటూ చెప్పి, ఏదో సహాయం చేస్తామంటూ నమ్మించి మోసం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. గతంలో ఫిర్యాదు చేసి ఉండడంతో బాధితులు నిజమనే నమ్మకం కూడా ఉంటుంది. ఎవరు ఫోన్ చేసినా ఆర్థిక పరమైన అంశాలు, డబ్బు డిపాజిట్ చేయమన్నారంటే అది మోసమని గుర్తించాలని సైబర్‌క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు.