CV Anand | సిటీబ్యూరో, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఆపరేషన్ రోప్‌ను పక్కాగా నిర్వహించాలని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ట్రాఫిక్ పోలీసులకు తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. ప్రధానంగా ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన చిరు వ్యాపారులు వివిధ వస్తువులను అమ్ముకొని జీవించేందుకు సైకిల్ ట్రాక్‌లు, ఫుట్‌పాత్‌లను ఆక్రమించుకుంటున్నారని, ఇలాంటి సందర్భాల్లో పేదరికం, జీవనోపాధి తదితర అంశాలను తీసుకురావొద్దని సీపీ సూచించారు. ఫుట్‌పాత్‌లను ఆక్రమించడం వంటివి ఒక మాఫియా లాంటి చర్య అన్నారు. ఫుట్‌పాత్‌లను ఆక్రమిస్తే ట్రాఫిక్‌కు మరింత ఇబ్బంది కలుగుతుందన్నారు. ప్రతిరోజు క్రేన్ల సాయంతో ట్రాఫిక్ క్లియరెన్స్ చేయాల్సిన అవసరముందన్నారు. ఇది నిరంతర ప్రక్రియ అని, ఈ పని చేస్తున్నప్పుడు అధికారులు విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటారని సీపీ ట్వీట్లో పేర్కొన్నారు. ఆక్రమణల తొలగింపు, రోప్ అమలులో ట్రాఫిక్ సిబ్బందికి ప్రతిఒక్కరూ సహకరించాలని సీపీ కోరారు.
ఆపరేషన్ రోప్..
హైదరాబాద్‌లో ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు చేపట్టిన ఆపరేషన్ రోప్(రిమూవబుల్ అబస్ట్రాక్టివ్ పార్కింగ్ ఎన్‌క్రోచ్‌మెంట్స్)ను పటిష్టంగా అమలు చేస్తే రోడ్లపై వాహనాలు సాఫీగా వెళ్లే అవకాశముంటుంది. పోలీస్స్టేషన్ల వారీగా రోప్ అమలు చేసేందుకు ఎస్హెచ్ఓల యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటున్నారు. ఇంకా యాక్షన్ ప్లాన్ చేసుకోని వారు ఉంటే వెంటనే తయారు చేసుకోవాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. ఆయా ఠాణాల పరిధిలో ఎక్కడ ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుంది? ఫుట్‌పాత్‌ల ఆక్రమణలకు కారణాలను విశ్లేషిస్తున్నారు. ఆయా ట్రాఫిక్ ఠాణాల పరిధిలో ఉన్న సమస్యలను జీహెచ్ఎంసీ, ఆర్టీసీ, ఎలక్ట్రిసిటీ తదితర విభాగాల అధికారులతోనూ సమన్వయం చేసుకోవాల్సిన అవసరముంటుంది. నగరంలో ట్రాఫిక్ వ్యవస్థ రోజురోజుకు గాడి తప్పుతుంది. ఆపరేషన్ రోప్‌తో సాఫీగా ట్రాఫిక్ సాగే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని నగరవాసులు కోరుతున్నారు.