Hyderabad | హైదరాబాద్ : మూసీ నదిలో మొసళ్లు స్వైరవిహారం చేస్తున్నాయి. ఎక్కడంటే అక్కడ మొసళ్లు ప్రత్యక్షం అవుతుండటంతో.. మూసీ నది పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. బయటకు వెళ్లాలంటేనే వణికిపోతున్నారు.
చైతన్యపురిలో మూసీ నది పరివాహక ప్రాంతంలో ఓ మొసలి ప్రత్యక్షమైంది. ఫణిగిరి కాలనీలోని శివాలయం వద్ద మొసలి కనిపించినట్లు స్థానికులు తెలిపారు. గత రెండు రోజుల నుంచి అదే ప్రాంతంలో మొసలి సంచరిస్తున్నట్లు పేర్కొన్నారు. స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మొసలి కదలికలపై అటవీశాఖ అధికారులకు పోలీసులు సమాచారం అందించారు. శివాలయం వైపు ఎవరూ వెళ్లొద్దని, అక్కడ మొసలి సంచరిస్తున్నట్లు పోలీసులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.
కొద్ది రోజుల క్రితం రాజేంద్రనగర్ పరిధిలోని కిషన్బాగ్, అసద్ బాబా నగర్ ఏరియాలో మొసళ్లు ప్రత్యక్షమైన సంగతి తెలిసిందే. అక్కడ గొర్రెపై మొసలి దాడి చేసినట్లు స్థానికుడు ఒకరు తెలిపారు. మూసీకి వరద ప్రవాహం వల్ల మొసళ్లు సంచరిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మొసళ్లను జనావాసంలోకి రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.