Crocodile | హైదరాబాద్ : లంగర్‌హౌస్ వద్ద మళ్లీ మూసీ నదిలో మొసలి ప్రత్యక్షమైంది. మళ్లీ ఆదివారం మొసలి ప్రత్యక్షం కావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ సీజన్లో మొసలి కనిపించడం ఇది మూడోసారి అని స్థానికులు పేర్కొన్నారు.
ఆదివారం సాయంత్రం కొంతమంది పిల్లలు మూసీ నది ఒడ్డును ఆడుకుంటుండగా.. ఓ బండరాయి మీద మొసలి ప్రత్యక్షమైంది. దీంతో పిల్లలు స్థానికులను అప్రమత్తం చేశారు. స్థానికులు భారీగా అక్కడికి చేరుకుని మొసలి దృశ్యాలను తమ ఫోన్లలో బంధించారు. అటవీశాఖ అధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు.
కొద్ది రోజుల క్రితం కిషన్‌బాగ్ వద్ద అసద్ బాబానగర్‌లో, చైతన్యపురి వద్ద మూసీ నదిలో మొసళ్లు ప్రత్యక్షమైన సంగతి తెలిసిందే. మొసళ్ల సంచారంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అయితే హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడంతో మూసీకి వరద పోటెత్తిన సంగతి తెలిసిందే. దీంతో నదిలో మొసళ్ల సంచారం అధికమైంది. నది పరివాహక ప్రాంతాల ప్రజలను మొసళ్లు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.