CRMP | సిటీబ్యూరో, మే 22 (నమస్తే తెలంగాణ): గుంతలు లేని ప్రయాణమే లక్ష్యంగా సీఆర్ఎంపీ రోడ్లకు శ్రీకారం చుట్టి ఇతర మెట్రో నగరాలకు ఆదర్శవంత పథకంగా బీఆర్ఎస్ తీర్చిదిద్దితే కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్లీ గుంతలమయమైన రహదారులు వాహనదారులకు దర్శనమిస్తున్నది. దీనికి కారణం జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యమే అని చెప్పక తప్పదు. వాస్తవంగా 4 విభాగాలుగా సీఆర్ఎంపీ రోడ్లను విభజించి నిర్వహణ చేపడుతున్న ఏజెన్సీల గడువు గత డిసెంబర్ నెలతో ముగిసింది.
అధికారులు సీఆర్ఎంపీ రోడ్లను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించకుండా సొంతంగా నిర్వహిస్తున్నారు. ఫలితంగా చాలా చోట్ల రహదారులపై గుంతలు ఏర్పడిన మరమ్మతులు చేయకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలు పడుతున్న వేళ.. ఆ జూన్ వరకు పనుల కోసమంటూ తాజాగా సికింద్రాబాద్ జోన్లో టెండర్లు పిలిచారు. లేన్ మార్కింగ్లు, క్యాచ్పిట్స్ మరమ్మతులు, ఫుట్పాత్లు, సెంట్రల్ మీడియన్లకు రంగులతో సహా సీఆర్ఎంపీ రోడ్ల నిర్వహణకు రూ.1.03 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచారు. మిగతా జోన్లలోనూ టెండర్లు పిలిచి పనులు ఏజెన్సీలతో నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు.
మళ్లీ టెండర్లు పిలువలేదు..
సీఆర్ఎంపీ కింద ప్రధాన మార్గాల్లోని రహదారుల నిర్వహణకు జీహెచ్ఎంసీ టెండర్లు ఆహ్వానిస్తోంది. ఐదేండ్ల కిందట ఈ పనుల్ని పెద్ద కాంట్రాక్ట్ ఏజెన్సీలకు ఇచ్చిన గడువు గత డిసెంబర్ -జనవరిల్లోనే ముగిసిపోయింది. కానీ ఇప్పటి వరకు మళ్లీ టెండర్లు పిలవలేదు. గతంలో మాదిరిగానే మళ్లీ పెద్ద ఏజెన్సీకు ఇచ్చే యోచనలో ఉన్న ఇంజినీరింగ్ అధికారులు ఈ మేరకు రెండు రకాల ప్రతిపాదనలతో స్టాండింగ్ కమిటీ ఆమోదం పొందిన విషయాన్ని తెలియజేస్తూ ప్రభుత్వ అనుమతి కోసం సచివాలయానికి పంపి వేచి చూస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత రాకపోవడంతో తాత్కాలికంగా కొంతకాలం వరకైనా జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలోనే ఈ పనులు చేసేందుకు తాజాగా టెండర్లు పిలుస్తున్నారు.