బంజారాహిల్స్ : సంస్కారాన్ని మర్చిపోయి రాహుల్ గాంధీపై అభ్యంతరకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ..
ఉత్తరాఖండ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మొత్తం మహిళాలోకాన్ని కించపర్చేలా మాట్లాడారని, రాజ్యాంగబద్దమైన పదవిలో ఉంటూ మహిళా జాతినే కించపర్చేలా రాహుల్‌గాంధీ జన్మ గురించి వ్యాఖ్యలు చేసిన హిమంత్ను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
అస్సాం ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్రంలోని 709 పోలీస్ స్టేషన్లలో కాంగ్రెస్ కార్యకర్తలు. నాయకులు ఫిర్యాదులు చేస్తున్నారన్నారు. అస్సాం ముఖ్యమంత్రిపై వెంటనే క్రిమినల్కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలు కేవలం సోనియా గాంధీని మాత్రమే అవమానించినట్టుకాదని, మొత్తం మహిళా జాతినే కించపర్చేలా ఉన్నాయన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్,మాజీ మంత్రి షబ్బీర్ అలీ,మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సంపత్, టీపీసీసీ కార్యదర్శి డా.రోహిన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బంజారాహిల్స్‌లో ఫిర్యాదు చేసిన రేణుకాచౌదరి..
అస్సాం ముఖ్యమంత్రిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని మాజీ కేంద్రమంత్రి రేణుకాచౌదరి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రేణుకా చౌదరి మాట్లాడుతూ.. అస్సాం ముఖ్యమంత్రి వ్యాఖ్యలు మొత్తం మహిళా జాతినే అవమానించేలా ఉన్నాయన్నారు.
హిందుత్వమంటే మహిళలను కించపర్చడమేనా అని ప్రశ్నించారు. ప్రధాని మోడీ ఇప్పటిదాకా అస్సాం ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై స్పందించకపోవడం సిగ్గుచేటు అన్నారు. అస్సాం ముఖ్యమంత్రి వ్యాఖ్యలను తెలంగాణ రాష్ట్రంలోని బీజేపీ మహిళా నేతలు సమర్థిస్తారా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.