Hyderabad Police | సిటీబ్యూరో, జనవరి 6 (నమస్తే తెలంగాణ): శాంతిభద్రతల విషయంలో ఆదర్శవంతమైన రికార్డు నమోదు చేసిన హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ 2024లో మాత్రం అభాసుపాలైంది. ప్రాథమిక పోలీసింగ్‌ను గాలికి వదిలేయడం, నిరంతర నిఘాలో విఫలమవడం, పెట్రోలింగ్ అదుపు తప్పడం వంటి కారణాలతో శాంతి భద్రతల నిర్వహణలో అనేక వైఫల్యాలు స్పష్టమయ్యాయి. 2024 సంవత్సరంలో దాదాపు 41 శాతం అధికంగా నేరాలు పెరగడమే ఇందుకు సాక్ష్యం. అందులోనూ తొలి 8 నెలల్లో భారీగా నేరాలు నమోదయ్యాయి. ఆ తర్వాత చివరి 4 నెలల్లో ఈ పరిస్థితి కొంత మెరుగుపడినా నగర పౌరుల నుంచి హైదరాబాద్ పోలీసులు అనేక విమర్శలు ఎదుర్కోక తప్పలేదు.
2023లో హైదరాబాద్ నగరంలో 25488 కేసులు నమోదు కాగా, 2024లో 35944 కేసులు నమోదయ్యాయి. 2023తో పోలిస్తే ఇది 41 శాతం అధికం. ఉన్నతాధికారులు సిటీ పోలీసింగ్‌ను గాలికి వదిలేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత హైదరాబాద్ సీపీగా శ్రీనివాస్ రెడ్డిని నియమించారు. ఆయన రావడంతోనే సిటీ పోలీసింగ్‌లో ప్రక్షాళన మొదలుపెట్టారు. అయితే ప్రక్షాళన పర్వంలో పెట్రోలింగ్, నిఘా వంటి కీలక అంశాలను విస్మరించినట్టు తెలుస్తున్నది. పెట్రోలింగ్ వ్యవస్థలో ఎన్ని వాహనాలున్నాయి? ఎన్ని పనిచేస్తున్నాయి? రాత్రి వేళల్లో సిబ్బంది ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు? అనే అంశాలను పక్కన పెట్టేశారు. దీంతో సుమారు 210 పెట్రోలింగ్ వాహనాలు నిత్యం తిరుగాల్సిన చోట, 60 శాతం మాత్రమే పెట్రోలింగ్ వాహనాలు తిరుగుతున్నా ఆ విషయంపై దృష్టి పెట్టలేదనే విమర్శలున్నాయి.
సెల్‌ఫోన్ స్నాచింగ్‌లు, హత్యలు జరిగినా సమయానికి పెట్రోలింగ్ వాహనాలు ఘటనా స్థలికి చేరుకోలేని పరిస్థితి నెలకొంది. గుడి మల్కాపూర్‌లో సెల్‌ఫోన్ స్నాచర్లు హత్యకు కూడా పాల్పడటంతో ఆ సమయంలో పెట్రోలింగ్ వాహనం సరైన సమయానికి రాలేదని, అప్పటి ఉన్నతాధికారులు సైతం అసహనం వ్యక్తం చేశారు. సౌత్, సౌత్ వెస్ట్, వెస్ట్, సౌత్ ఈస్ట్, ఈస్ట్ ఇలా అన్ని జోన్లలో పరిస్థితి చేయి దాటి పోయింది. రాత్రి పూట గస్తీని గాలికి ఒదిలేశారు. దీంతో రాత్రి వేళల్లో నేరాలు భారీగా జరిగాయి.
రౌడీ షీటర్ల హత్యలు, సెల్‌ఫోన్ స్నాచింగులు పెరిగాయి. ఎందుకు పరిస్థితి చేయి దాటిపోయిందో అర్ధం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నతాధికారులు ఉన్నారనే విమర్శలు రావడం, దీంతో వాటిని అధిగమించేందుకు ఏకంగా డెకాయ్ ఆపరేషన్లు చేసి నేరస్థులపై కాల్పులు చేశారు. తమ సొంత ఆలోచనలను సిబ్బందిపై రుద్దేందుకు ప్రయత్నించడంతో క్షేత్ర స్థాయిలో కొంతమంది సిబ్బంది పనిచేయకుండా చేతులెత్తెశారు. ఉన్నతాధికారుల వేధింపులు తట్టుకోలేక ఏకంగా కొందరు మూకుమ్మడి సెలవులు పెట్టాలని, మరి కొందరు ఒక్కసారిగా ఆందోళనకు దిగాలని, ఇంకా కొందరు అవసరమైనప్పుడు శాంతి భద్రతల పరిరక్షణను గాలికి ఒదిలేస్తే, అందరు దిగి వస్తారనే ఆలోచనలు సైతం చేసినట్లు పోలీసు విభాగంలో చర్చ జరిగింది.
ఇదే సమయంలో హైదరాబాద్‌లో హత్యలు, దొంగతనాలు, దోపిడీలు పెరిగిపొయ్యాయని కాంగ్రెస్ అధికారంలోకి రావడంతోనే రాష్ట్ర రాజధాని బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తీశారంటూ అటూ ప్రతిక్షం, ప్రజలు గొంతెత్తడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. పైగా 2024లో జనవరి నుంచి ఆగస్టు వరకు మొదటి ఎనిమిది నెలల్లో ఎక్కువగా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే సిటీ సీపీగా వ్యవహరించిన శ్రీనివాస్‌రెడ్డిని బదిలీ చేసి ఆయన స్థానంలో నగరంపై పూర్తి పట్టు కలిగిన సీనియర్ ఐపీఎస్ సీవీ ఆనంద్‌కు బాధ్యతలు అప్పగించారు.
తొలి 8 నెలల్లో భారీగా నేరాలు పెరిగిపోవడంతో ప్రభుత్వం ఆందోళనకు గురైంది. శాంతిభద్రతల విషయంలో సమస్యలు ఉత్పన్నమవుతాయనే విషయాన్ని గుర్తించి పోలీసింగ్‌ను గాడిలో పెట్టేందుకు గతంలో సీపీగా పనిచేసి ఏసీబీ చీఫ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్‌కు హైదరాబాద్ పగ్గాలు మరోసారి అప్పగించారు. సిటీ పోలీసింగ్‌పై పూర్తి పట్టున్న ఆయన బాధ్యతలు చేపట్టగానే వినాయక నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తూ, ఎందుకు నేరాలు పెరుగుతున్నాయని క్షేత్ర స్థాయిలో ఆరా తీశారు. ఎన్నికల సమయంలో హైదరాబాద్‌లో పనిచేసిన అధికారులు ఇతర ప్రాంతాలకు, ఇతర ప్రాంతాలలో పనిచేసిన వారు హైదరాబాద్‌కు బదిలీలపై వచ్చారు.
హైదరాబాద్ పోలీసింగ్‌పై వారికి సరైన అవగాహన లేదని గుర్తించారు. జోన్ల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ ఎక్కడక్కెడ లోపాలున్నాయని గుర్తించి వాటిని సరిచేస్తూ పనిచేస్తున్న సిబ్బందికి సిటీ పోలీసింగ్‌పై అవగాహన కల్పిస్తూ, మూడు నెలలుగా సిటీ పోలీసింగ్‌ను గాడిలో పెడుతూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే పెట్రోలింగ్ వ్యవస్థను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేస్తూ వాటి పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ నేరాలు చివరి మూడు నెలలు తగ్గుముఖం పడుతూ వచ్చాయి. ఎన్నికల సమయంలో ఇతర జిల్లాల నుంచి వచ్చిన సిబ్బంది సిటీకి బదిలీపై రావడం, వారికి సిటీ పోలీసింగ్‌పై పూర్తి అవగాహన లేకపోవడంతో కొద్దిగా 2024లో నేరాలు పెరిగాయని సిటీ పోలీసింగ్ వార్షిక నివేదిక విడుదల సందర్భంగా సీపీ సీవీ ఆనంద్ వెల్లడించిన విషయం తెలిసిందే.