సిటీబ్యూరో, మార్చి 1 (నమస్తే తెలంగాణ) : మారిన జీవన శైలి గుండె జబ్బులకు కారణమవుతున్నాయని జీహెచ్ఎంసీ సీఎంఓహెచ్ డాక్టర్ పద్మజ పేర్కొన్నారు. సీపీఆర్‌పై అవగాహన ఉన్నట్లయితే చాలా వరకు సడెన్ కార్డియాక్ అరెస్ట్‌ను తగ్గించవచ్చన్నారు. ఈ మధ్య కాలంలో అందరిలోనూ సడెన్ కార్డియాక్ అరెస్ట్‌లు ఆందోళనకు గురి చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే సకాలంలో సీపీఆర్ (కార్డియో పల్మనరీ రిససిటేషన్) చేయడం వల్ల చనిపోయే వారి సంఖ్యను తగ్గించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే జీహెచ్ఎంసీ సిబ్బందికి రెండు రోజులుగా జీవీకే, ఈఎంఆర్ఐ వేదికగా శిక్షణ అందించారు. జీహెచ్ఎంసీ సీఎంఓహెచ్ డాక్టర్ పద్మజ ఆధ్వర్యంలో మంగళవారం మూడు జోన్లు, బుధవారం మరో మూడు జోన్లకు సంబంధించి 10 మంది వైద్య బృందంతో పాటు శానిటేషన్, పారిశుద్ధ్య విభాగం సిబ్బందికి సీపీఆర్ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు.