CPIML | జవహర్‌నగర్, ఫిబ్రవరి 9 : నిరుద్యోగులకు రూ. 4 వేల భృతి… వృద్ధులకు రూ. 4వేల పింఛన్ ఏమైందని, ఇందిరమ్మ రాజ్యంలో… ఇంటింటా సౌభాగ్యం అంటూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ఇంటింటా శోకాన్నే మిగిల్చిందని, ఆరు గ్యారంటీల అమలులో కాగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫమైందని సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసి హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ఝన్సీ దుయ్యబట్టారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ‘ఆరు గ్యారంటీ పథకాల అమలులో అడ్డం పడిపోయిందని’ సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసి రాష్ర్ట కమిటీ పిలుపు మేరకు జవహర్‌నగర్ కార్పొరేషన్లో సీపీఐఎంల్ న్యూ డెమోక్రసి మేడ్చల్ కమిటీ కామ్రేడ్ శివబాబూ ఆధ్వర్యంలో ఆదివారం కార్మికులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసి హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ఝన్సీ హాజరై మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం గెలిస్తే 100 రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ మాటలు నీటి మూటలుగానే మిగిలాయని, గ్రామాల్లో ప్రజలు సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీస్తున్నారని అన్నారు. రైతు బంధు రూ. 10వేలు ఉంటే… మేము రూ. 15వేలు చెల్లిస్తామని రైతుల ఓట్లు వేయించుకొని రైతులను పట్టించుకున్న పాపనా పోలేదని… రైతు గోస ప్రభుత్వానికి తగులతదని శాపనార్థాలు పెట్టారు.
విద్యార్థులకు రూ. 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామని, ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూలు కట్టిస్తామని చెప్పిన ప్రభుత్వం ఏ ఒక్కటి ఆచరణలో పెట్టకుండ గత ప్రభుత్వాన్ని నిందించడం సిగ్గుచేటన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయకుంటే పెద్ద ఎత్తున ఉద్యమించి కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచుతామని హెచ్చరించారు. ఈ నెల 20న హైదరాబాద్‌లో జరిగే ప్రజా ప్రదర్శన బహిరంగ సభకు ప్రజలు వేలాదిగా తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షురాలు అరుణ, ప్రధాన కార్యదర్శి అనురాధ, పీవోడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి రామ్‌రెడ్డి, పీడీఎస్‌యూ జిల్లా ఉపాధ్యక్షుడు శ్యామ్, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.