కవాడిగూడ, ఏప్రిల్ 12: కబ్జాల బారిన పడకుండా ఇందిరాపార్క్‌ను కాపాడేందుకు ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని సీపీఐ జాతీయ నాయకులు డాక్టర్ కె.నారాయణ సూచించారు. ఇందుకోసం అవసరమైతే ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఇందిరాపార్కులో జరుగుతున్న ఆక్రమణలను వెంటనే అరికట్టాలని డిమాండ్ చేస్తూ సేవ్ ఇందిరాపార్క్ పేరుతో ఇందిరాపార్క్ వాకర్స్ ప్రొటెక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నాచౌక్‌లో ఆదివారం ధర్నా నిర్వహించారు.
ఈ ధర్నా కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, ఏఐటీయూసీ నాయకులు బోస్, సీపీఐ కార్యదర్శి స్టాలిన్లు పాల్గొని మద్దతు పలికారు. ఈ సందర్భంగా డాక్టర్ కె. నారాయణ మాట్లాడుతూ ఇందిరాపార్క్‌లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాలన్నారు. ఇందిరాపార్కులో మరోవైపు కొనసాగుతున్న డంపింగ్ యార్డును తొలగించాలని డిమాండ్ చేశారు.
పార్కులో కనీస సౌకర్యాలను కల్పించాలని, కబ్జాల బారినుంచి పార్క్‌ను కాపాడాలని, వాకర్స్ సమస్యలను పరిష్కరించాలని ఐదుగురితో కూడిన ప్రతనిధి బృందంతో త్వరలోనే జీహెచ్ఎంసీ కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. నగరం నలుమూలల నుంచి ఇందిరాపార్క్‌కు వాకింగ్ కోసం వచ్చే వాకర్స్‌కు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇందిరాపార్క్ వాకర్స్ వెంకట్‌రెడ్డి, నమో నారాయణ, మీసాల విఠల్‌రావు, నర్సింగ్‌రావు, జి.జయేందర్‌బాబు, లింగం, రాజయ్య, మురళి, కిరణ్, శ్రీనివాస్, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.