సిటీబ్యూరో, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): వివిధ కారణాలతో పోయిన రూ.2 కోట్ల విలువైన 591 సెల్ఫోన్లను రాచకొండ సీసీఎస్ పోలీసులు రికవరీ చేశారు. గురువారం నేరేడ్మెట్లోని రాచకొండ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించి, కొంత మంది బాధితులకు సెల్ఫోన్లను అందజేశారు. సీపీ వివరాలు వెల్లడిస్తూ.. సెల్‌ఫోన్ పోగొట్టుకున్న బాధితులు కొందరు సీఈఐఆర్ పోర్టల్‌లో ఫిర్యాదు చేస్తున్నారని తెలిపారు.
ఐఎంఈఐ నంబర్ ఆధారంగా ఆయా సెల్ఫోన్లను రికవరీ చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ఎల్బీనగర్, మల్కాజిగిరి, భువనగిరి సీసీఎస్ పోలీసులు ఐటీసెల్ విభాగంతో సమన్వయం చేసుకుంటూ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సెల్ఫోన్లను రికవరీ చేశారని సీపీ వివరించారు. ఇందులో ఎల్బీనగర్ (339), భువనగిరి (103), మల్కాజిగిరి (149) సీసీఎస్‌ల నుంచి రికవరీ చేశామన్నారు.
ఇప్పటి వరకు రాచకొండ పోలీసు కమిషనరేట్ పోలీసులు సీఈఐఆర్ పోర్టల్‌కు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా 3213 ఫోన్లను రికవరీ చేసినట్టు వెల్లడించారు. ఈ ఫోన్లకు సంబంధించి అదనపు సీపీ ఎం.శ్రీనివాసులు నోడల్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్నారని తెలిపారు. అలాగే, ఎల్బీనగర్ సీసీఎస్ (కె.నరేందర్, వై.మల్లిఖార్జున్, జె.జవహర్), మల్కాజిగిరి సీసీఎస్ (ఎ.సతీశ్వర్రాజ్, రఘురామ్‌రెడ్డి, సీహెచ్. అంకమ్రావు, శ్రీనివాస్), భువనగిరి (వి.మధుసూదన్‌రెడ్డి, ఎస్.శ్రీనివాసన్, ఎస్కే.మహ్మద్, పి.సైదులు) ఆయా ప్రత్యేక బృందాలలో ఉన్నారని సీపీ తెలిపారు.