చార్మినార్, జూలై 13 : మొహర్రం త్యాగానికి ప్రతీకగా నిలుస్తుందని నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన డబీర్‌పురలోని చారిత్రక బిబికా అలవా అషూర్‌ఖానాలో ప్రతిష్ఠించిన అలంలకు నగర పోలీస్ విభాగంలోని ఉన్నతాధికారులతో కలిసి దట్టీలు సమర్పించారు. ఈ సందర్భంగా సీపీ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ మానవాళి శాంతి కోసం త్యాగధనులు చూపిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ స్వీకరించాలని తెలిపారు.
కాగా, చారిత్రక బిబికా అలవా నుంచి ప్రారంభమయ్యే మాతం ఊరేగింపు అలీజా కోట్ల, చార్మినార్, గుల్జార్‌హౌస్, మీరాలం మండి, దారుల్ షిఫా, కాలికబర్ మీదుగా చాదర్‌ఘాట్ వరకు కొనసాగనున్నది. ఈ నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి మాతం ఊరేగింపు కొనసాగే మార్గాన్ని పరిశీలించారు. చార్మినార్, గుల్జార్‌హౌస్ వద్ద చేపట్టాల్సిన జాగ్రత్తలను అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు స్నేహమేరా, కాంతిలాల్ పాటిల్, అడిషనల్ డీసీపీ షేక్ జహంగీర్ పాల్గొన్నారు.