సిటీబ్యూరో, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ట్రాఫిక్ విధుల్లో మంచి పనితీరు కనబరిచే సిబ్బందికి గుర్తింపు ఇస్తూ.. రోడ్లపై అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ స్పష్టం చేశారు. బంజారాహిల్స్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఆడిటోరియంలో గురువారం ట్రాఫిక్ విభాగంపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో క్షేత్ర స్థాయిలో తలెత్తుతున్న సమస్యలను సిబ్బందిని, అధికారులను అడిగి తెలుసుకున్నారు. ట్రాఫిక్ పోలీసింగ్‌ను మరింత మెరుగుపరిచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై సిబ్బంది నుంచి సలహాలు, సూచనలు తీసుకొని పలు విషయాలపై దిశా నిర్దేశం చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ పోలీస్‌కు ట్రాఫిక్ సిబ్బందే ముఖ చిత్రం అని, నిబద్ధత, అంకిత భావంతో పనిచేస్తూ పోలీస్ శాఖకు మంచిపేరు తీసుకువస్తున్నారని, వారి సేవలను కొనియాడారు. డ్రంక్ అండ్ డ్రైవ్, మైనర్ డ్రైవింగ్, రాంగ్ రూట్, డేంజర్ డ్రైవింగ్, తదితర ఉల్లంఘనలను ఏ మాత్రం ఉపేక్షించకుండా, చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచనలు చేశారు. ఈ నెల 27 నుంచి ప్రతి నెలా క్రమం తప్పకుండా అన్ని విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటామని, ట్రాఫిక్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా ఈ సమావేశాల్లో చర్చిస్తామని తెలిపారు. యూ టర్న్‌లపై శాస్త్రీయంగా అధ్యయనం చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
రియల్ టైం ట్రాఫిక్ మానిటరింగ్ వ్యవస్థను మరింత పటిష్టంగా ఏర్పాటు చేయాలని, సాంకేతికత ద్వారా ట్రాఫిక్ సమస్యలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని, విధి నిర్వహణలో ఉత్తమ పనితీరు కనబర్చిన వారిని గుర్తిస్తామని, అలాగే ఎవరైనా రోడ్లపై అవినీతికి పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించలేది లేదని స్పష్టం చేశారు. ట్రాఫిక్ పోలీసులు మల్టీప్లేయర్‌గా పనిచేయాల్సి ఉంటుందని, రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించాలన్నారు. త్వరలో ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్(టీసీసీసీ) ప్రొటోకాల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సమావేశంలో ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్, డీసీపీలు వెంకటేశ్వర్లు, ఎస్.శ్రీనివాస్, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.