CV Anand | సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. న్యాయపరమైన సలహాలు తీసుకుని ముందుకెళ్తామని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ కమిషనరేట్ వార్షిక మీడియా సమావేశంలో సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. ఘటన సమయంలో అల్లు అర్జున్ వద్దకు వెళ్లేందుకు ఎస్‌హెచ్‌వో కూడా తీవ్రంగా కష్టపడాల్సి వచ్చిందని తెలిపారు.
అల్లు అర్జున్ వచ్చేందుకు థియేటర్ వాళ్లు దరఖాస్తు చేస్తే తిరస్కరించామని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. థియేటర్ వాళ్లు అల్లు అర్జున్‌కు విషయం చెప్పారో.. లేదో తమకు తెలియదని అన్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై మాట్లాడిన అనంతరం బౌన్సర్ల సప్లై ఏజెన్సీలకు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బౌన్సర్లు ఇకపై పోలీసులను ముట్టుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీసుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే.. ఊరుకునేది లేదని అన్నారు. బౌన్సర్ల ప్రవర్తనకు సప్లై ఏజెన్సీలదే పూర్తి బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రజల ఇబ్బంది గురించి ఆలోచించే బాధ్యత వీఐపీలదే అని పేర్కొన్నారు.
అల్లు అర్జున్ మేనేజర్ సంతోష్ వద్దకు వెళ్లి తొక్కిసలాట విషయం చెప్పామని ఏసీపీ రమేశ్ కుమార్ తెలిపారు. ఒక బాలుడు పరిస్థితి విషమంగా ఉందని.. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించామని పేర్కొన్నారు. మేనేజర్ మమ్మల్ని అల్లు అర్జున్ వద్దకు వెళ్లనీయలేదని చెప్పారు. అతి కష్టం మీద వారిని నెట్టుకుంటూ వెళ్లి అల్లు అర్జున్‌కు విషయం చెప్పామని అన్నారు. కానీ సినిమా చూసిన తర్వాతే అక్కడి నుంచి వెళ్తామని చెప్పారని అన్నారు. 10 నిమిషాలు చూసిన తర్వాత డీసీపీ ఆదేశాల మేరకు అల్లు అర్జున్ను బయటకు తీసుకొచ్చామని వివరించారు.