బంజారాహిల్స్, మార్చి 7: హైదరాబాద్ ఓపెన్ టెన్నిస్ అసోసియేషన్ (హోట), జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో 21 వ జాతీయ స్థాయి ఓపెన్ టెన్నిస్ చాంపియన్షిప్ (National Championship) పోటీలు శుక్రవారం ఉదయం జూబ్లీహిల్స్ క్లబ్లో ప్రారంభం అయ్యాయి. నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఈ టోర్నమెంట్ను ప్రారంభించారు. దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన 336 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొననున్నారు.
ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. హైదరాబాద్లో టెన్నిస్ క్రీడాకారులకు ప్రోత్సాహం కల్పించేందుకు 21 ఏండ్ల క్రితం హైద్రాబాద్ ఓపెన్ టెన్నిస్ అసోసియేషన్ ప్రారంభించామన్నారు. ప్రస్తుతం దేశంలోని పలు ప్రాంతాల నుంచి క్రీడాకారులు వచ్చి ఈ టోర్నమెంట్ లో పాల్గొంటున్నారని.. దీనివల్ల ఇక్కడి ఆటగాళ్లకు మంచి అనుభవం వస్తుందన్నారు. హోట ఆధ్వర్యంలో ప్రతియేటా ఇలాంటి పోటీలు నిర్వహించాలని సూచించారు. తాను అండర్ 19 జట్టుకు ఆడుతున్నపుడు ఉన్న స్నేహితులు కూడా ప్రస్తుతం టెన్నిస్ టోర్నమెంట్లో పాల్గొంటున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ అధ్యక్షుడు కె.సురేందర్ రెడ్డి, కార్యదర్శి కిలారు రాజేశ్వర్ రావు, హోటా అధ్యక్షుడు నంద్యాల నరసింహా రెడ్డి, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొమ్మిది మంది పాతతరం టెన్నిస్ క్రీడాకారులను ఘనంగా సత్కరించారు.