సిటీబ్యూరో, మే 29 (నమస్తే తెలంగాణ): మహానగరానికి ఒకే ఒక్క సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఉందని, ఇందులో 120 మంది మాత్రమే పనిచేస్తున్నారని, సైబర్ క్రైమ్‌లు పెరుగుతున్న స్థాయిలో సైబర్ క్రైమ్ పోలీస్‌స్టేషన్‌కు సామర్థ్యం లేదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. గురువారం కమిషనరేట్ పరిధిలోని ఏడు జోన్లలో జోన్వారీగా జోనల్ సైబర్ క్రైమ్ సెల్‌లను సీవీ ఆనంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ పది సంవత్సరాలుగా సైబర్ క్రైమ్ కేసులు విపరీతంగా పెరిగిపోయాయని, సుమా రు పదిశాతం కేసులు పెరిగినట్లు చెప్పారు. 2015లో సైబర్ క్రైమ్ కేసులు 351 నమోదైతే, 2024లో 3111 నమోదైనట్లు తెలిపారు.
పెరుగుతున్న సైబర్ క్రైమ్‌లను విచారించే స్థాయిలో సెంట్రల్ సైబర్ క్రైమ్ పీఎస్ లేకపోవడంతో జోనల్ వారీగా సైబర్ సెల్‌ను ఏర్పాటు చేయడానికి నిర్ణయించి నెలరోజులుగా సిబ్బందికి శిక్షణ ఇచ్చామని తెలిపారు. ఒక్కటే సైబర్ పీఎస్ ఉండడం వల్ల స్టేషన్‌కు వచ్చే చిన్నచిన్న కేసులు వదిలేయడం లేదా విచారణ లేకుండా పిటిషన్ తీసుకుని పట్టించుకోకపోవడం, పీఎస్‌లో కేసులు వస్తే సైబర్ క్రైమ్సామర్థ్యం లేక పిటిషన్‌ను సామర్థ్యం లేనందువల్ల తీసుకోవడంలో జాప్యం జరుగుతున్నదని సీపీ తెలిపారు. మూడునాలుగేళ్లుగా 39 రకాల సైబర్ క్రైమ్‌లను గుర్తించామని, ఇందులో సోషల్ మీడియా ఫిర్యాదులు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ప్రతి పోలీస్‌స్టేషన్‌లో సైబర్క్రైమ్సెల్ ఏర్పాటు చేయలేం కాబట్టి జోనల్ డీసీపీ ఆధ్వర్యంలో ఏడు సైబర్ క్రైమ్ సెల్స్ ఏర్పాటు చేస్తున్నామని, వీటిని ఆయా జోన్ డీసీపీలు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు.
రోజువారీ వస్తున్న ఫిర్యాదుదారుల నుంచి రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకు ఆన్లైన్ మోసం, సైబర్ మోసాలకు సంబందించి జెడ్సీసీలో జోన్ల వారీగా, స్టేషన్ల వారీగా తీసుకుని స్టేషన్లలో కేసులు నమోదు చేసి జెడ్‌సీసీలు పరిశోధిస్తాయని ఆనంద్ చెప్పారు. రూ.25వేల కన్నా తక్కువవుంటే లీగల్ ప్రాసెస్ ప్రకారం దర్యాప్తు చేస్తారని తెలిపారు. జోన్ డీసీపీలు ఫిర్యాదులతో పాటు దర్యాప్తులను పర్యవేక్షించి టీమ్‌లను పంపించి వారి ద్వారానే అరెస్ట్‌లతో సహా అన్ని రకాల విచారణ ఇకపై జడ్సీసీ చేస్తుందని , లక్ష దాటితే ఆయాకేసులు సెంట్రల్ సైబర్ క్రైమ్ పోలీస్‌స్టేషన్‌లో విచారణ చేస్తారని ఆయన పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో నేరాలు చేస్తున్న నైజీరియన్లను డిపోర్ట్ చేస్తున్నామని, డిపోర్ట్ చేసిన తర్వాత కూడా చాలామంది నకిలీ పాస్‌పోర్టులతో ఇండియాలో ప్రవేశించి ఏదో ఒక నేరం చేసి పట్టుబడి ఇక్కడే ఉండడానికి ప్లాన్ చేస్తున్నారని సీవీ ఆనంద్ చెప్పారు. చివరకు 498 కేసులోనైనా కేసు పెట్టించుకుని ఇక్కడే ఉండే ప్రయత్నం చేస్తున్నారని సీవీ తెలిపారు.బంగ్లాదేశ్‌కు చెందిన పౌరులు కూడా శరణార్థులుగా ఇక్కడికి వస్తున్నారని, వారి వ్యవహారాన్ని కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్లామని ఆనంద్ పేర్కొన్నారు. ఉగ్రవాద లింక్స్ ఉన్న సమీర్ కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్నదని, హైదరాబాద్‌లో ఎన్ఐఏ నాలుగుచోట్ల సోదాలు చేసిందని, ఎన్ఐఏ విచారణ, సోదాలకు హైదరాబాద్ పోలీసుల సహకారం అడిగితే చేస్తామని చెప్పారు.