సిటీబ్యూరో, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ)/బేగంపేట: పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా ఈ నెల 4 రాత్రి సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన దుర్ఘటనలో హైదరాబాద్ పోలీసులు థియేటర్ యజమాన్యానికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ‘మీ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో 10 రోజుల్లో వివరణ ఇవ్వండి’ అంటూ.. థియేటర్ యజమాని రేణుకా దేవికి హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ నోటీసుల్లో పేర్కొన్నారు.
తొక్కిసలాట ఘటనపై పోలీసులు విరుద్ధమైన వాదలను వినిపించారు. థియేటర్ యాజమాన్యం అనుమతి తీసుకోలేదని మొదట చెప్పిన పోలీసులు… ఆ తర్వాత మాట మార్చారు. దరఖాస్తు చేశారు కానీ పోలీసు అధికారులకు ఈవెంట్ గురించి వివరించలేదని చెప్పారు. పోలీసులు తమకు అనుమతి ఇచ్చారంటూ సంధ్య థియేటర్ యాజమాన్యం వద్ద ఉన్న లేఖ సోషల్‌మీడియాలో కనిపించగా ఈ విషయంపై కూడా మరోసారి మాట మార్చారు. ఆ లేఖను కార్యాలయంలో ఇచ్చి వెళ్లారు కానీ సంబంధిత అధికారిని ఎవరినీ కలవలేదని పోలీసులు మరో వాదన వినిపిస్తున్నారు. ఇదిలా ఉండగా సినీ నటుడు అల్లు అర్జున్‌కు హైకోర్టు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్‌ను రద్దు చేయించేందుకు, సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలని పోలీసులు యోచిస్తున్నట్టు సమాచారం. ఇందుకు గల కారణాలు ఏమిటో స్పష్టంగా తెలియరాలేదు. తొక్కిసలాటకు ఘటనలో తమకు ఏ సంబంధమూ లేదని తప్పించుకునేందుకే పోలీసులు సంధ్య థియేటర్‌కు నోటీసులిచ్చారని నగరవాసులు చర్చించుకుంటున్నారు. థియేటర్ వద్ద జరిగిన ఘటనలో నిర్లక్ష్యం ఎవరిది? యాజమాన్యానిదా? నటుడిదా? పోలీసులదా? అనే అంశంపై సర్వత్రా మాట్లాడుకుంటున్నారు.
తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ కిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ (9)ను తెలంగాణ ప్రభుత్వ హెల్త్ సెక్రటరీ క్రిస్టీనా, సీపీ ఆనంద్ పరామర్శించారు. శ్రీ తేజ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… శ్రీతేజ కోలుకోవడానికి మరింత సమయం పడుతుందని వైద్యులు తెలిపారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నట్టు తెలిపారు. త్వరలోనే శ్రీతేజ హెల్త్ బులిటెన్‌ను వైద్యులు విడుదల చేస్తారని అన్నారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిని రెగ్యులర్‌గా మానిటరింగ్ చేస్తున్నామని పేర్కొన్నారు.
సిటీబ్యూరో, డిసెంబర్ 17(నమస్తే తెలంగాణ): శేరిలింగంపల్లి జోన్ పరిధిలో పలు జంక్షన్ల అభివృద్ధి, సుందరీకరణ పనులను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మంగళవారం ప్రారంభించారు. గోపన్‌పల్లిలో రాగా ఫౌండేషన్ నిర్మించిన చిన్న జంతు శ్మశానవాటికను స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో కలిసి మేయర్ ప్రారంభించారు. అనంతరం జేఆర్సీ జంక్షన్ బ్యూటిఫికేషన్ ఆఫ్ స్కేలింగ్, స్కల్పర్, ఫౌంటైన్లు, క్యాస్కేడ్లు ప్రారంభించారు. బయోడైవర్సిటీ జంక్షన్ బ్యూటిఫికేషన్, శిల్పాలు, ఫౌంటైన్, లైటింగ్‌ల అప్‌స్కేలింగ్, రోడా మిస్త్రీ కాలేజ్ కమాన్ నుంచి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం వరకు వీధి ఫర్నిచర్‌ను మేయర్ ప్రారంభించారు. శేరిలింగంపల్లి సర్కిల్-20లోని గచ్చిబౌలి స్టేడియంలో శిల్పాలు, ఫౌంటైన్తో కూడిన రోటరీల అభివృద్ధి పనులు, ఖాజాగూడ జంక్షన్ బ్యూటిఫికేషన్ ఆఫ్ స్కేలింగ్ ఆఫ్ శిల్పాలు, లైటింగ్ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, ఎస్ఈ శంకర్ నాయక్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.