మెహిదీపట్నం : శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు పోలీసులకు ఎల్లప్పుడూ సహకరించాలని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. సులభతరమైన పోలీసింగ్ అందించడంలో భాగంగా నగరంలో 72వ పోలీస్ స్టేషన్‌గా టోలిచౌకి పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేశామని, ఇక్కడ పోలీసుల సేవలను ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. బుధవారం టోలిచౌకి పోలీస్ స్టేషన్‌ను నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, దక్షిణ పశ్చిమ మండలం డీసీపీ చంద్రమోహన్, అదనపు ఇక్బాల్ సిద్ధికి, టోలిచౌకి ఏసీపీ సయ్యద్ ఫయాజ్, ఇన్స్పెక్టర్ రమేశ్ నాయక్ లతో కలిసి సందర్శించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజల శాంతిభద్రతల పరిరక్షణ కోసం నగరంలో పోలీసింగ్‌ను పటిష్టం చేయడంలో భాగంగా జోన్లను విభజించామని, అదేవిధంగా ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్లను కొత్తగా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇందులోభాగంగానే టోలిచౌకి పోలీస్‌స్టేషన్ కొత్తగా ప్రారంభించామన్నారు. ఫిలింనగర్, మెహదీపట్నం, గోల్కొండ పోలీస్స్టేషన్ల ప్రాంతాల్లో నుంచి కొన్ని ప్రాంతాలను టోలిచౌకి పోలీస్ స్టేషన్ పరిధిలోకి తెచ్చామన్నారుఏ. ఈ సందర్భంగా మొదటి ఎఫ్ఐఆర్ను కమిషనర్ సీవీ ఆనంద్ నమోదు చేశారు.