సిటీబ్యూరో, మార్చి 21 (నమస్తే తెలంగాణ) : లోక్సభ ఎన్నికల సందర్భంగా క్షేత్ర స్థాయిలో తీసుకోవాల్సిన భద్రత ఏర్పాట్లు, కేసుల నమోదు, సెక్షన్ల అమలు, చట్టపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి రాచకొండ సీపీ తరుణ్ జోషి అవగాహన కల్పించారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు పాటించాల్సిన నియమ నిబంధనలు న్యాయ నిపుణులు రాములు సిబ్బందికి వివరించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఎఫ్ఐఆర్ నమోదు, విచారణలో ఎలాంటి అలసత్వం, పక్షపాతం వహించకుండా సిబ్బందికి దిశా నిర్ధేశం చేశారు.
పరిమితికి మించిన అక్రమ నగదును ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ సమక్షంలో సీజ్ చేయాలని సూచించారు. నగదుతో పాటు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే సామగ్రిని అక్రమంగా తరలిస్తే పట్టుకోవాలని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ప్రభుత్వ అనుమతి కలిగి ఉన్న ఆయుధాలను స్వాధీనం చేసుకొని ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తరువాత తిరిగి అప్పగించాలని సూచించారు. ఈ సమావేశంలో డీసీపీ చంద్రమోహన్, కరుణాకర్, అదనపు డీసీపీలు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.