e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home News పరుగులొద్దు.. పదిలం

పరుగులొద్దు.. పదిలం

పరుగులొద్దు.. పదిలం
 • ఆ నాలుగు గంటలు జాగ్రత్త
 • పొంచి వున్న మహమ్మారి
 • తొందరలో జాగ్రత్తలు విస్మరించొద్దు
 • ప్రణాళిక మేరకు పనులు పూర్తి చేసుకోవాలి
 • సమస్యలను ‘కొని’తెచ్చుకోవద్దు
 • అవసరమైతేనే బయటకు రండి
 • పిల్లలను వెంట తీసుకెళ్లొద్దు

కరోనా నియంత్రణకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించగా, ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మినహాయింపు ఇచ్చింది. నిత్యావసరాలు, కూరగాయలు, ఇతరాత్ర కొనుగోలు చేసుకునేందుకు సడలింపు కల్పించింది. అయితే చాలామంది హడావుడిగా పరుగులు తీస్తూ ముప్పును ‘కొని’ తెచ్చుకుంటున్నారు. టైం అయిపోతుందనే తొందరలో వైరస్‌ బారిన పడుతున్నారు. ఓ పక్క వాచీ, సెల్‌ఫోన్‌ చూసుకుంటూ పరుగులు తీస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్రణాళిక లేకుండా బయటకెళ్లి ఇబ్బందులు పడుతూ ఇంటికి చేరుతున్నారు. ప్రతిరోజు బయటకెళ్లకుండా అన్ని పనులను ఒకేసారి పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. ఇంట్లో అందరూ కాకుండా ఒక్కరే బయటకెళ్లడం ఉత్తమం. మార్కెట్లు, దుకాణాలు, షాపింగ్‌ మాల్స్‌, మందుల దుకాణాలు, మద్యం షాపులు నాలుగు గంటలపాటు కిక్కిరిసి ఉండటంతో మాస్క్‌ ధరించి దూరం పాటిస్తూ జాగ్రత్తగా కొనుగోలు చేయాలి.

ఇలా చేయొద్దు..

 1. సగం మాస్క్‌ పెట్టుకోవడం.
 2. గుంపుల్లో తిరగడం.
 3. బయట నేరుగా తినడం.
 4. ఒకే మాస్క్‌ను పదేపదే వాడడం.
 5. కరెన్సీ నోట్లను నోట్లో పెట్టుకోవడం.
 6. లిఫ్ట్‌ ఉపయోగించడం.

ఇలా మేలు

 1. మాస్క్‌, గ్లౌజ్‌, శానిటైజ్‌ సీసా తప్పనిసరి.
 2. దుకాణాల వద్ద భౌతికదూరం పాటించడం.
 3. వస్తువులు తీసుకోగానే శానిటైజ్‌ చేసుకోవడం.
 4. నోట్ల కన్నా డిజిటల్‌ పేమెంట్‌ చేయడం.
 5. లిఫ్ట్‌ కన్నా మెట్లను ఉపయోగించడం.
 6. తెచ్చిన వస్తువులను శుభ్రంగా కడగడం.
 • ‘ఇంటికి సంబంధించిన పనులు పూర్తి చేసుకునేందుకు కుంటుంబంలో ఒక్కరే బయటకు వెళ్లేలా చూసుకోవాలి.
 • మాస్క్‌, గ్లౌజులు ధరించాలి.
 • కొనుగోలు ప్రాంతంలో భౌతిక దూరం పాటించడంతో పాటు తరచుగా చేతులను శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి.
 • ఇంటికి చేరుకున్న వెంటనే సబ్బుతో కాళ్లు, చేతులు కడుక్కోవాలి.

కొవిడ్‌ -19 వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం ఉదయం 6నుంచి 10 గంటల వరకు ప్రజా అవసరాల కోసం సడలింపు ఇచ్చింది. ఈ 4 గంటల సమయంలో కుటుంబానికి కావాల్సిన నిత్యావసర సరుకులు, మందులు కొనుగోలు చేయడంతో పాటు ఇతర పనులు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే ఈ సమయాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకునేందుకు సరైన ప్రణాళిక అవసరం. ప్రణాళిక లేకుండా బయటకు కొందరు పరుగులు పెడుతూ.. సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. అనవసరమైన ఉరుకులు, పరుగులతో ఉపద్రవాన్ని కొని తెచ్చుకోవద్దని వైద్య నిపుణులు చెబుతున్నారు.

మార్కెట్‌ సందర్శనలో జాగ్రత్తలు..

 • మార్కెట్లకు వెళ్లాల్సి వస్తే.. కచ్చితంగా ఎన్‌-95 మాస్క్‌ లేదా సర్జికల్‌ నోస్‌ మాస్క్‌ను ధరించాలి.
 • బయట నుంచి తిరిగి ఇంటికి వెళ్లే వరకు మాస్క్‌ తీయకూడదు.
 • ప్లాస్టిక్‌ స్లిప్పర్స్‌ను పాదరక్షలుగా వేసుకోవాలి.
 • ఆరు ఫీట్లు ఉండేలా భౌతిక దూరం పాటించాలి.
 • ఏదైనా వస్తువును ముట్టుకున్నప్పుడు శానిటైజర్‌తో చేతులను శుభ్రం చేసుకోవాలి.
 • ఏటీఎం సెంటర్‌కి వెళ్లినప్పుడు ముందుగా ఏటీఎం కీబోర్డ్‌ను శానిటైజ్‌ చేయాలి.
 • లావాదేవీలు పూర్తయ్యాక చేతులను శుభ్రం చేసుకోవాలి.
 • ఇంటిలో ఉన్నప్పుడు సైతం మాస్క్‌ ధరిస్తే మంచిది.

డిజిటల్‌ చెల్లింపులే ఉత్తమం..!!

 • కరెన్సీ ఉపయోగాన్ని వీలైనంత వరకు తగ్గించడానికి ప్రయత్నించాలి.
 • డిజిటల్‌ వినియోగాన్ని ఆచరించాలి.
 • గూగుల్‌ పే, బీమ్‌ యాప్‌, నెట్‌ బ్యాంకింగ్‌ తదితర ఆన్‌లైన్‌ లావాదేవీలు ఉపయోగించుకోవాలి.
 • కరెన్సీ తీసుకోవాల్సి వస్తే ఇంటికి వెళ్లాక నోట్లను రెండు వైపులా ఐరన్‌ చేయడం మంచిది.
 • నాణేలను కూడా శానిటైజ్‌ చేయాలి.

ఇంట్లో ఇలా..

 • ఇంటిని ప్రతిరోజు రెండు శాతం డిటెర్జెంట్‌ లేదా 0.2 శాతం లైజోల్‌ లేదా డెటాల్‌తో శుభ్రపర్చాలి.
 • శానిటైజర్‌తో ప్రధాన డోర్‌, కాలింగ్‌ బెల్‌ను పరిశుభ్రం చేసుకోవాలి.
 • బట్టలు, తువ్వాలలు ప్రతిరోజు డిటర్జెంట్‌తో ఉతుక్కోవాలి.
 • చేతులను శుభ్రం చేసుకునే సమయంలో వేళ్ల మధ్య, గోళ్లు, మణికట్టు మొత్తంగా కనీసం 20సెకన్ల పాటు సబ్బుతో రుద్దుతూ పరిశుభ్రం చేసుకోవాలి.

కూరగాయలు, పండ్లను ఇలా..

మార్కెట్‌లో కూరగాయలు, పండ్లు కొనుగోలు చేశాక.. వాటిని అలానే ఉపయోగించకూడదు. మొదటగా వాటిని గోరువెచ్చని ఉప్పు నీళ్లలో వేయాలి. లేదా డిటెర్జెంట్‌ నీటితో వాటిని శుభ్రం చేయాలి. అనంతరం వాటిని ఫ్రిజ్‌లో పెట్టాలి. మిల్క్‌ ప్యాకెట్స్‌ను సబ్బుతో కడగాలి.

అత్యవసరమైతేనే.. బయటకు వెళ్లాలి

లాక్‌డౌన్‌ సమయంలో కుటుంబమంతా ఇంట్లోనే కాలక్షేపం చేయాలి. టీవీ వీక్షణం, ఆట పాటలు, పుస్తక పఠనం, రుచికరమైన పిండి వంటలు, దైవ చింతన, మొదలైన వంటి వాటితో ఇల్లే సర్వస్వంగా గడపాలి. చిన్నారులు తల్లిదండ్రుల పర్యవేక్షణలో చిత్రలేఖనం, సైక్లింగ్‌ ప్రాక్టీసు చేయాలి.

లిఫ్ట్‌ను ఇలా.. ఉపయోగిద్దాం

వీలైనంత వరకు లిఫ్ట్‌ వినియోగించకపోవడమే మంచిది. లిఫ్ట్‌ వాడాల్సి వస్తే చేతులతో లిఫ్ట్‌ కీ ప్యాడ్‌ ముట్టకూడదు. వెంట తీసుకెళ్లిన ఏదైనా పేపర్‌ సహాయంతో చేతిని కవర్‌ చేసుకుని పుష్‌ బటన్‌ నొక్కాలి. బయటకు వచ్చాక వెంటనే ఆ పేపర్‌ను రెండో వైపు తాకకుండా డస్ట్‌బిన్‌లో వేయాలి.

ఇంటి లోపలికి వెళ్లే సమయంలో..

ఇంటికి వెళ్లిన అనంతరం, వెంటనే తలుపులను ముట్టుకోకుండా కుటుంబ సభ్యులను పిలిచి డోర్‌ తెరిపించాలి. వెంట తీసుకెళ్లిన సామగ్రిని ఏదైనా ప్రత్యేక ప్రాంతంలో ఉంచాలి. వాష్‌రూంకు వెళ్లి కనీసం 20సెకన్ల పాటు చేతులు, ముఖాన్ని సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. వీలైతే స్నానం చేయడం ఇంకా మంచిది. ధరించిన బట్టలను డిటర్జెంట్‌ వాటర్‌లో నానబెట్టాలి. పాదరక్షలను పరిశుభ్రంగా కడుక్కోవాలి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పరుగులొద్దు.. పదిలం

ట్రెండింగ్‌

Advertisement