బంజారాహిల్స్: మద్యం మత్తులో కారు నడుపుతూ యాక్సిడెంట్ చేయడంతో పాటు బ్రీత్ అనలైజర్ పరీక్షలకు సహకరించకుండా మూడు గంటల పాటు న్యూసెన్స్‌కు పాల్పడిన ఓ యువజంటకు కోర్టు సరికొత్త షరతుతో బెయిల్ మంజూరు చేసింది. వివరాల్లోకి వెళ్తే.. వెస్ట్ మారెడ్‌పల్లికి చెందిన తీగుళ్ల దయాసాయి రాజ్( 28) అనే వ్యాపారి తన స్నేహితురాలి(25)తో కలిసి శనివారం రాత్రి జూబ్లీహిల్స్‌లోని జేఆర్సీ కన్వెన్షన్‌లో పార్టీకి వెళ్లాడు. పార్టీలో పీకలదాకా మద్యం సేవించిన దయాసాయిరాజ్ కారు నడిపించుకుంటూ జూబ్లీహిల్స్ రోడ్ నం. 1లోని నందమూరి బాలకృష్ణ ఇంటి సమీపంలో అతివేగంగా డివైడర్‌ను ఢీకొట్టాడు. దీంతో కారు గాల్లోకి ఎగిరి రోడ్డుకు రెండోవైపు పడిపోయింది.
అదృష్టవశాత్తూ ప్రమాదం జరిగిన సమయంలో వాహనాలు లేకపోవడంతో పెనుముప్పు తప్పింది. అయితే ప్రమాదం తర్వాత జూబ్లీహిల్స్ పోలీసులు అక్కడకు చేరుకుని బ్రీత్ అనలైజర్ పరీక్షల కోసం ప్రయత్నించగా వీరంగం సృష్టించారు. తాము మద్యం సేవించలేదని, తమకు ఎందుకు పరీక్షలు చేస్తారంటూ సుమారు 3గంటల పాటు చుక్కలు చూపించారు. తమ మీద కేసు ఎలా పెడ్తారు.. ? మా కారు ఎవరినీ ఢీకొట్టలేదు కదా.. అంటూ వితండ వాదం చేశారు. ఎట్టకేలకు మూడు గంటల తర్వాత వారిద్దరికీ బ్రీత్ అనలైజర్ పరీక్షలు చేయగా మోతాదుకు మించి మద్యం సేవించినట్లు తేలింది.
ర్యాష్ డ్రైవింగ్‌తో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినందుకు వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు రెండ్రోజుల కిందట కోర్టులో హాజరుపర్చారు. పోలీసులపట్ల దురుసుగా ప్రవర్తించడంతో పాటు మద్యం మత్తులో భారీ యాక్సిడెంట్ చేయడమే కాకుండా న్యూసెన్స్‌కు పాల్పడడంతో రిమాండ్ విధించాలని పోలీసులు కోరారు. కాగా నిందితులకు బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం.. వినూత్నమైన షరతును విధించింది. 15 రోజుల పాటు రోజూ జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి సంతకం చేయడంతో పాటు ఉదయం 10నుంచి 12 గంటల వరకు అక్కడున్న రిసెప్షన్ వద్ద ఉండి పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదు దారులకు స్వాగతం పలకాలనే షరతు కింద బెయిల్ మంజూరు చేశారు. దీంతో రెండ్రోజులుగా దయాసాయిరాజ్‌తో పాటు అతడి స్నేహితురాలు పీఎస్‌కు వస్తున్నారు.