Suicide | బండ్లగూడ, మే 3 : ఆర్థిక ఇబ్బందులతో దంపతులిద్దరూ క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో భార్య రాజేశ్వరి (38)అక్కడికక్కడే మృతి చెందగా రాజేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇన్స్పెక్టర్ క్యాస్ట్రో రెడ్డి, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… ఏదులాబాదుకు చెందిన రమేష్ చిన్ననాటి నుంచి హైదరాబాద్ బాలనగర్లో నివాసం ఉంటున్నారు. స్థానికంగా ఇతను వెంకటేశ్వర వర్క్ షాప్ను నిర్వహిస్తున్నాడు. ఇతనికి రాజేశ్వరి అనే మహిళతో వివాహం జరిగింది. వీరికి ఒక కూతురు ఉంది. కొంతకాలం వీరి జీవితం సజావుగానే సాగింది. కాగా ఇటీవల రమేష్ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ పూర్తిగా దివాలా తీశారు. దీంతో భార్య రాజేశ్వరి మతిస్థిమితం కోల్పోయి పిచ్చి ఆసుపత్రిలో చేరింది. అనంతరం ఆమె ఆరోగ్యం కుదుటపడింది.
కాగా, దిక్కుతోచని స్థితిలో ఉన్న వారికి మియాపూర్లో ఉంటున్న రమేష్ సోదరి వారికి అండగా నిలిచింది. ఆమెకు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎర్రబోడలో ఒక ఇల్లు ఉంది. నెల రోజుల క్రితం రమేష్ ఆయన భార్య రాజేశ్వరిని ఆ ఇంట్లో ఉంచి రెండు నెలలకు సరిపడా రేషన్ కూడా సమకూర్చి మంచిగా ఉండాలని సూచించింది. ఇదిలా ఉంటే ఏప్రిల్ 30వ తేదీ రాత్రి రమేష్ రాజేశ్వరీ కలిసి క్రిమిసంహారక మందు సేవించి ఆత్మహత్యకు యత్నించారు. అర్ధరాత్రి భార్య రాజేశ్వరికి వాంతులు, విరేచనాలై చివరకు ప్రాణాలు కోల్పోయింది. రమేష్ కూడా వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న విషయాన్ని స్థానికులు గుర్తించి ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటికే రాజేశ్వరి మృతి చెందగా రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.