Hyderabad | సిటీబ్యూరో, మార్చ్ 3 (నమస్తే తెలంగాణ): ఇటీవల నుమాయిష్‌లో బోరబండకు చెందిన ఇద్దరు విద్యార్థులు యువతులను తాకేందుకు ప్రయత్నించడం, కొందరితో వెకిలిచేష్టలు వేస్తూ వారిని సతాయించారు. ఎవరూ గమనించడం లేదంటూ అసహ్యంగా వ్యవహరించారు. వీరిని గమనించిన షీటీమ్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు.
సికింద్రాబాద్ స్టేషన్‌కు సమీపంలోని ఒక కాలనీలో వివాహిత అక్కడ షాపింగ్ మాల్‌కు వెళ్లి వస్తుంటే ముగ్గురు బండిపై వచ్చి అసభ్యంగా ప్రవర్తిస్తూ కామెంట్ చేస్తూ వేధించారు. మరో ప్రాంతంలో నైట్‌డ్యూటీ చేసి వస్తున్న ఉద్యోగినులను నలుగురు మైనర్లు వేధించారు. వారిని దారుణంగా కామెంట్ చేస్తూ టూవీలర్స్‌పై ఫీట్లు చేస్తూ భయపెట్టారు. వీరిని అదుపులోకి తీసుకుని విచారించగా హైదరాబాద్‌కు వలస వచ్చిన కుటుంబాల పిల్లలు కావడం, తల్లిదండ్రుల ఆజమాయిషీ లేకపోవడంతో పిల్లలు ఇలా తయారయినట్లుగా కౌన్సిలింగ్లో తేలింది.
బుద్దిగా చదువుకోవలసిన పిల్లలు దారితప్పుతున్నారు. ఆకతాయిలుగా పోలీసు రికార్డులకు ఎక్కుతున్నారు. బహిరంగప్రదేశాలలో యువతులను వేధిస్తున్న వారిలో మైనర్లే పెద్ద సంఖ్యలో ఉంటున్నారు. హైదరాబాద్‌లో షీటీమ్స్‌కు చిక్కుతున్న వారిలో ఎక్కువగా 18 సంవత్సరాలలోపు పిల్లలే ఉండడం గమనార్హం. షీటీమ్స్ నిర్వహిస్తున్న డెకాయ్ ఆపరేషన్స్‌లో సరాసరి 35-40 శాతం మైనర్లే ఉంటున్నారు. అసభ్య పదజాలంతో దూషించడం, సామాజిక మాధ్యమాల్లో వేధించడం వంటి ఘటనలు ఎక్కువగా నమోదవుతున్నాయి. మైనర్లు తమను వేధిస్తున్నారంటూ కొందరు వివాహితల నుంచి సైతం షీటీమ్స్‌కు ఫిర్యాదులొచ్చాయి.
రద్దీప్రాంతాలు, టూరిస్ట్ప్లేసుల్లో..!
షీటీమ్స్‌కు పట్టుబడుతున్న మైనర్ల సంఖ్య ప్రతీ సంవత్సరం పెరుగుతోంది. గ్రేటర్‌లోని రద్దీ ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాలు, మెట్రో రైల్వే స్టేషన్లు, విద్యాసంస్థలున్నచోట ఆకతాయిలు వేధింపులకు పాల్పడుతున్నారు. వీటిలో అధికశాతం చార్మినార్, గోల్కొండ, అమీర్‌పేట షాపింగ్ఏరియా, రేతిఫైల్ బస్‌స్టాండ్‌ల్లో జరుగుతున్నాయి. రద్దీగా ఉంటే చాలు.. అక్కడ యువతులను, మహిళలను టార్గెట్‌గా చేసుకుని వికృతంగా ప్రవర్తిస్తున్నారు. వీరి ఆగడాలతో మహిళలు ఆయా ప్రాంతాల్లో తిరిగే సమయంలో భయపడాల్సిన పరిస్థితి చోటు చేసుకుందని షీటీమ్స్‌కు ఫిర్యాదులందాయి. మైనర్ల ఆగడాలు శృతిమించుతున్న నేపథ్యంలో షీటీమ్స్ పోలీసులు ప్రత్యేకంగా నిఘా పెట్టి ఆయా ప్రాంతాల్లో పోకిరీల ఆటకట్టిస్తున్నారు.
పెంపకంలో లోపమే కారణం..!
మహిళలను వేధిస్తూ పట్టుబడుతున్న మైనర్లలో ఎక్కువ శాతం కుటుంబాల్లో సమస్యలు ఉన్నవారు, సరైన పెంపకం లేకపోవడం కారణంగానే అని కౌన్సిలింగ్ల్లో వెల్లడవుతోంది. ముఖ్యంగా అక్రమసంబంధాలు, కుటుంబసమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, తల్లిదండ్రుల్లో ఒక్కరే ఉన్న కుటుంబాల్లోని పిల్లలే ఎక్కువగా ఈ పోకిరీల్లో ఉంటున్నట్లుగా పోలీసులు కౌన్సిలింగ్ చేసే సమయంలో గమనించారు. సోషల్‌మీడియా ప్రభావం కూడా ప్రధాన కారణంగా చెబుతున్నారు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు శ్రద్ధ వహించి వారి ప్రవర్తనలో మార్పు కనిపిస్తే ఖచ్చితంగా నిఘాపెట్టాలని, నెమ్మదిగా వారిని సన్మార్గంలో పెట్టే ప్రయత్నం చేయాలని పోలీసులు సూచించారు.
గత నాలుగేళ్లుగా షీటీమ్స్‌కు చిక్కిన మైనర్లు:
సంవత్సరం : షీటీమ్స్ పట్టుకున్న మైనర్లు
2021 : 42
2022 : 24
2023 : 25
2024 : 106