రంగారెడ్డి, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో పత్తి రైతు కుదేలవుతున్నాడు. ఓ వైపు వరుసగా కురుస్తున్న వర్షాలు అన్నదాతను కోలుకోలేని దెబ్బ తీస్తుండగా..మరోవైపు సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో మధ్య దళారుల ప్రమేయం మరింత పెరిగింది. ఈ పరిస్థితిలో అంతంతమాత్రంగా వస్తున్న దిగుబడిని విక్రయించుకునేందుకు రైతన్న దళారులను ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడింది. గతేడాది ఎకరాకు 10 క్వింటాళ్ల వరకు వచ్చిన పత్తి దిగుబడి ఈ ఏడాది మూడు నుంచి నాలుగు క్వింటాళ్లు కూడా వచ్చే అవకాశం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఈ వానకాలంలో రైతులు 1,30,000 ఎకరాల్లో పత్తి పంటను సాగు చేశారు. చేతికందే సమయంలో వరుసగా కురుస్తున్న వర్షాలు అన్నదాతను నిండా ముంచుతున్నాయి. అధిక వర్షాలతో పూత రాలడంతోపాటు రంగూ మారుతున్నది. కాయ మురిగిపోతుండటంతో రైతన్న కన్నీ రు మున్నీరవుతున్నాడు. వర్షాలు ఇలాగే కురిస్తే కనీసం పెట్టుబడి వచ్చే పరిస్థితి కూడా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ నెలలో ఇప్పటికే మూడుసార్లు వర్షాలు కురువడంతో పంటకు తీవ్ర నష్టం జరిగింది. పంటను విక్రయించేటప్పుడు తేమ శాతం పెరగడంతో మధ్యదళారులు రూ. ఐదు నుంచి రూ. ఆరువేల చొప్పున క్వింటాల్‌ను కొంటునన్నారని.. దీంతో పెట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితి నెలకొన్నదని వాపోతున్నారు.
జిల్లాలో పత్తిని సేకరించేందుకు 12 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ, ఇప్పటివరకు ఐదు కేంద్రాలను మాత్రమే ప్రారంభించారు. పత్తి అధికంగా పండే మాడ్గుల, యాచారం మండలాల్లో ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలనే ప్రారంభించలేదు. వర్షాలు వచ్చి పంటకు నష్టం కలిగే అవకాశముండడంతో రైతులు ఇప్పటికే పత్తిని ఏరి విక్రయానికి సిద్ధంగా ఉంచారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాక పోవడంతో పత్తి తడిసిపో యే అవకాశం ఉండడంతో చేసేదేమీలేక మధ్యదళారులకు తక్కువ ధరకు పత్తిని విక్రయించి నష్టపోతున్నారు. ప్రభు త్వం పత్తికి రూ. 8100 మద్దతు ధర ప్రకటించగా.. దళారులు మాత్రం రూ. ఆరువేల నుంచి రూ. ఆరువేల ఐదువందలకే కొంటున్నారు.
కొందుర్గు : మండలంలో మొత్తం 21,000 ఎకరాలుండగా.. అందులో 7,200 ఎకరాల్లో రైతులు పత్తి పంటను సాగు చేశారు. కాగా, ఆ పంట ఇటీవల కురుస్తున్న వానలకు మసకబారడం, నెలకొరుగుతుండడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఈ పంట సాగుకు రూ. లక్షలు ఖర్చు చేశామని.. అవి వచ్చే పరిస్థితి కనిపించడంలేదని వాపోతున్నారు. తీసుకొచ్చిన అప్పులను ఎలా తీర్చాలో అర్థం కావడంలేదని పేర్కొంటున్నారు.
ఓ వైపు తెల్ల బంగారం మసకబారుతుంటే.. మరోవైపు పత్తి కొనుగోలు కేంద్రాల వద్ద తేమశాతం 12 శాతం కంటే ఎక్కువగా ఉంటే కొనమని అక్కడి సిబ్బంది తేగేసి చెబుతుండడంతో రైతులు దిక్కుతోచనిస్థితిలో ఉన్నారు. ముసురు వర్షం, వాతావరణం మార్పులు రైతులకు శాపంగా మారింది. దేశానికే అన్నం పెట్టే రైతన్న కండ్లముందే తాము కష్టపడి సాగు చేసిన పంట నష్టపోతుండడంతో కన్నీరుమున్నీరవుతున్నాడు. ప్రభుత్వం స్పందించి ఆదుకోకుండా.. అప్పుల పాలు కావడం ఖాయమని పేర్కొం టున్నాడు.
జిల్లాలో పత్తి అధికంగా మాడ్గుల మండలంలో పండుతుంది.ఈ మండలంలో సుమారు 50,000 ఎకరాల్లో ఈ పంటను సాగు చేయగా.. దిగుబడి కూడా గణనీయంగా వచ్చే అవకాశమున్నది. కాగా, ఇక్కడ ఇప్పటికీ ప్రభుత్వం ఒక్క కొనుగోలు కేంద్రా న్ని కూడా ఏర్పాటు చేయలేదు. గతంలో ఈ మండలంలోని రైతులు ఆకుతోటపల్లి, పోలేపల్లిల్లోని కేంద్రాలకు వెళ్లేవారు. కానీ, అక్కడ కూడా ఇప్పటివరకు కొనుగోలు కేంద్రం ఏర్పాటు కాలేదు. దీంతో రైతులు తమ పంటను విక్రయించేందుకు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆమనగల్లుకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొన్నది. అంద దూరం వెళ్లలేక రైతులు మధ్య దళారులకు తక్కువ ధరకు విక్రయిస్తూ నష్టాల పాలు అవుతున్నారు. వారికి పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఉన్నది. మాడ్గుల, యాచారం మండలాల రైతుల కోసం మాల్లో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఇప్పటికే ఈ మండలాల రైతులు కలెక్టర్‌ను కలిసి వినతిపత్రాన్ని కూడా అందజేశారు. కానీ, ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రం ఏర్పాటుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
ఇతరుల వద్ద ఐదెకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని అందులో పత్తి ని సాగు చేశా. ఇందుకు అధికంగానే ఖర్చు అయింది. పం ట బాగా పడింది. తీసుకొచ్చిన అప్పులు తీరుతాయని భావించా. కానీ, చేతికొచ్చే సమయంలో వానలు కురుస్తుండడంతో పంట పూర్తిగా నల్లగా మారింది. పత్తి నెల రాలుతున్నది. పెట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితి నెలకొన్నది. ప్రభుత్వం నష్టపోయిన రైతులను ఆదుకోవాలి.
– నర్సింహులు, రైతు, బైరంపల్లి, కొందుర్గు