Hyderabad | బాలానగర్, ఏప్రిల్ 8: ఏటీఎంలో ఇప్పటి వరకు డబ్బులు రావడం చూశాం.. ఎనీటైం వాటర్ పేరుతో నీళ్లు రావడం కూడా చూశాం.. తాజాగా 10 రూపాయలు వేస్తే క్లాత్ బ్యాగ్ వస్తుంది. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఆచరణలో చేసి చూపించారు జీహెచ్ఎంసీ అధికారులు. ప్లాస్టిక్హ్రిత నగరంగా తీర్చిదిద్దడం కోసం రెండు ప్రైవేటు సంస్థలతో కలిసి నగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ) ఐడీపీఎల్ పండ్ల మార్కెట్ వద్ద క్లాత్ బ్యాగ్ ఏటీఎంను ఏర్పాటుచేసింది.
బాలానగర్ డివిజన్లోని ఐడీపీఎల్ ఫ్రూట్ మార్కెట్ వద్ద మోవెట్, యునైటెడ్ వే హైదరాబాద్ సౌజన్యంతో ఎనీ టైం కాటన్ బ్యాగ్ (బ్యాగ్ ఏటీఎం)ను అధికారులు శనివారం ప్రారంభించారు. హైదరాబాద్‌ను ప్లాస్టిక్హ్రిత నగరంగా తీర్చిదిద్దడం కోసం పైలట్ ప్రాజెక్ట్ కింద వెండింగ్ మిషన్‌ను ఏర్పాటు చేశామని యునైటెడ్ వే హైదరాబాద్ బోర్డ్ సభ్యురాలు మారెడ్డి మమత తెలిపారు. మోవెట్ స్వచ్ఛంద సంస్థ రూ.2.5 లక్షలతో చెన్నై నుంచి ఈ మిషన్లను తెప్పించినట్టు పేర్కొన్నారు.
సెల్ప్ హెల్ప్ గ్రూపుల వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కోసం కాటన్ బట్ట ద్వారా బ్యాగులు తయారు చేసే బాధ్యతను వారికి కట్టబెట్టినట్టు వెల్లడించారు. .కార్యక్రమంలో యునైటెడ్ వే హైదరాబాద్ సీఈవో రేఖా శ్రీనివాసన్, కూకట్పల్లి సర్కిల్ ఈఈ గోవర్ధన్‌గౌడ్, కూకట్పల్లి సర్కిల్ ఎన్విరాన్మెంట్ సూపర్ వైజర్ అశ్విని పాల్గొన్నారు.
This is a terrific initiative 👍 https://t.co/4gm9cnvZeT
— KTR (@KTRBRS) April 8, 2023
క్లాత్ బ్యాగ్ ఏటీఎంపై మంత్రి కేటీఆర్ ప్రశంసలు
ప్లాస్టిక్‌ను ఉపయోగించకుండా వినియోగదారులు క్లాత్ బ్యాగ్‌లు వాడాలనే ఉద్దేశంతో ఐడీపీఎల్ పండ్ల మార్కెట్ సమీపంలో క్లాత్ బ్యాగ్ ఏటీఎంను ఏర్పాటుచేసినట్టు జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ మమత ట్విట్టర్లో తెలిపారు. ఏటీఎం సోలార్ విద్యుత్తుతో పనిచేస్తుందని పేర్కొన్నారు. దీనిపై ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. అద్భుతమైన చొరవ అంటూ ప్రశంసించారు.