బడంగ్‌పేట మున్సిపల్ కార్యాలయంలో అవినీతి తిమింగలాల పుట్ట పగులుతోంది. జీహెచ్ఎంసీలోకి విలీనానికి ముందుగా అవినీతి తిమింగలాలు అడ్డూఅదుపు లేకుండా చెలరేగిపోయాయి. ఇంజినీరింగ్ నుంచి శానిటేషన్ వరకు ప్రతి విభాగంలోనూ అక్రమాలు రాజ్యమేలాయి. నిబంధనలను తుంగలో తొకి, నకిలీ బిల్లులు సృష్టించి కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని కొల్లగొట్టారు. ఇప్పటికే ఆధారాలతో సహా వచ్చిన ఫిర్యాదులపై అటు ఏసీబీ, ఇటు జీహెచ్ఎంసీ విజిలెన్స్ విభాగం అధికారులు రంగంలోకి దిగి. సమగ్ర స్థాయి విచారణలో అక్రమాల తంతును నిగ్గు తేల్చారు.
– సిటీబ్యూరో, మార్చి 30 (నమస్తే తెలంగాణ)
సిటీబ్యూరో, మార్చి 30 (నమస్తే తెలంగాణ) : గడిచిన కొన్ని రోజులుగా క్షేత్రస్థాయిలో విచారణ జరిపిన విజిలెన్స్ విభాగం అధికారులు శంషాబాద్ జోన్ పరిధిలోని బడంగ్‌పేట సర్కిల్-16 కార్యాలయం అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిందని నిర్థారించారు. శానిటేషన్ నుంచి ఇం/rనీరింగ్, టౌన్‌ప్లానింగ్ వరకు ప్రతి విభాగంలో ఎక్కడెక్కడ అవినీతి జరిగిందో సమగ్ర వివరాలు, బాధ్యులపై చర్యలకు సిఫారసు చేస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్‌కు విజిలెన్స్ విభాగం నివేదిక సమర్పించింది. ప్రాథమిక సమాచారం మేరకు పారిశుద్ధ్య కార్మికుల హాజరు పట్టికల్లో భారీగా వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించారు. పని చేయని వారి పేరుతో జీతాలు డ్రా చేశారు. ఇంజినీరింగ్ విభాగంలో జీవో నంబర్ 94కు విరుద్ధంగా టెండర్ల ప్రక్రియ కొనసాగింది. అర్హత లేని కాంట్రాక్టర్లకు పనులు కట్టబెట్టడం, అసలైన కాంట్రాక్టర్లను బెదిరించి ‘విత్ డ్రా’ లేఖలు తీసుకోవడం వంటి దారుణాలు జరిగినట్లు తెలుస్తున్నది.
5% కంటే తకువ రేటుకే టెండర్లు కేటాయిస్తూ ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చారు. ఒక జేసీబీ లేదా ట్రాక్టర్ పనిచేస్తే, దానికి ఇంజినీరింగ్, శానిటేషన్ విభాగాల నుంచి వేర్వేరుగా ‘డబుల్ బిల్లింగ్’ చేసి నిధులు డ్రా చేశారు. ఒకే ఇంటి నంబర్ పై పదుల సంఖ్యలో నివాసాలు వెలిశాయంటే ఇకడి అధికారుల చేతివాటం ఏ స్థాయిలో ఉందో విచారణ అధికారులే విస్మయం చెందిన పరిస్థితి. కురుమల్ గూడ నుంచి జవహర్ నగర్ కు చెత్త తరలింపు పేరిట కేవలం రెండు నెలల కాలంలోనే (ఆగస్టు-అక్టోబర్ 2025) రూ. 30 లక్షల నిధులను దుర్వినియోగం చేశారు. వెటర్నరీ (రూ. 45 లక్షలు), జిపిఎస్ వాహనాల నిర్వహణ, చివరికి దినపత్రికల ప్రకటనల పేరుతో కూడా వాస్తవ ఖర్చు కంటే రెట్టింపు బిల్లులు సృష్టించి నిధులు కాజేశారు.
హాట్ టాపిక్‌గా ఫైళ్ల మిస్సింగ్ అంశం
ఇంజినీరింగ్, శానిటేషన్ విభాగాలకు చెందిన పెండింగ్ బిల్లుల ఫైళ్లను తనిఖీ సమయంలో 236 ఫైళ్లను విచారణ అధికారులకు దొరకుండా అధికారులు దాచిపెట్టిన తీరు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా శానిటేషన్ విభాగం అవినీతి వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన ఒక ఉన్నతాధికారి సంతకం ఉన్న సంబంధిత ఫైళ్లు మాయం కావడం…ఏసీబీ సైతం సీరియస్‌గా తీసుకున్నది. ఐతే సంబంధిత ఫైళ్లను మాయం చేసిన ఘటనలో సంబంధిత ఉన్నతాధికారులు కనీసం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయకపోవడం, ఈ అవినీతి తతంగంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ ఇంజనీర్‌ను బదిలీ చేసిన అధికారులు, శానిటేషన్‌లో అన్నీ తానై వ్యవహరించి ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి కొట్టిన అధికారిపై ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదో అన్న అంశంపై చర్చ జరుగుతున్న తరుణంలో విజిలెన్స్ విభాగం నివేదికపై జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారో అన్నది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రజాధనాన్ని లూటీ చేసిన బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, అక్రమంగా మళ్లించిన సొమ్మును రికవరీ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
అధికారులపై చర్యలు తీసుకోవాలి
ముదిరాజ్ సమన్వయ కమిటీ
ఖైరతాబాద్, మార్చి 30: రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని మంచిరేవుల గ్రామంలో ఓ దేవాలయ శంకుస్థాపనకు హాజరైన ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్ర జ్ఞానేశ్వర్‌ను అవమానించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ముదిరాజ్ సమన్వయ కమిటీ డిమాండ్ చేసింది. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమిటీ ప్రతినిధులు చొప్పరి శంకర్, ఉప్పరి నారాయణ మాట్లాడుతూ.. సీఎం ప్రొటోకాల్ ఉండగా, కార్పొరేషన్ చైర్మన్‌ను అధికారులు అడ్డుకునే హక్కు ఎక్కడిదని, వారి తీరును ఖండిస్తున్నామన్నారు. ముదిరాజ్‌లకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు.. డాక్టర్ వినోద్ కుమార్, పుట్ట రాజు, చలపతి, వెంకటేశ్, సంతోశ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.