Mahila Sangam | శంషాబాద్ రూరల్, డిసెంబర్ 21: మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే మహిళా సంఘాలను ఏర్పాటు చేసి వారికి తక్కువ వడ్డీలకు రుణాలు ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే శంషాబాద్ మండలం నర్కూడ గ్రామంలోని కెనరా బ్యాంకులోని కొన్ని సంఘాల్లో పని చేస్తున్న వీఏవోలు, వీవోలు , కొంతమంది గ్రూపు లీడర్లు కలిసి సభ్యులకు తెలియకుండానే రుణాలు తీసుకొని.. వాటిని చెల్లించకుండానే మరో రుణం పొందుతున్నారు. అలాగే ప్రతి నెల సజావుగా చెల్లిస్తున్న వారికి రుణాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. శంషాబాద్ మండలంలోని నర్కూడ గ్రామంలో ఓ మహిళా సంఘంలో పదిమంది సభ్యులున్నారు.
పాత రుణం తిరిగి చెల్లించే క్రమంలో ఓ సభ్యురాలు రూ.2 లక్షలు తిరిగి చెల్లింకచపోయినా ఆమెకు తిరిగి రుణాలిచ్చారు. దాదాపు రెండు సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ చెల్లించలేదు. కానీ, సజావుగా రుణాలు చెల్లిస్తున్న వారు.. కొత్త రుణం ఇవ్వాలని కోరగా మీరు లక్ష రూపాయలు రుణం చెల్లిస్తేనే తిరిగి రుణం వస్తుందని 15 రోజులుగా బుకాయిస్తున్నారు. దీంతో ఓ సభ్యురాలికి అనుమానం వచ్చి బ్యాంకుకు చేరుకొని మేనేజర్ సమక్షంలో పూర్తి వివరాలు(బుక్లో) పరిశీలించింది. సంఘం రుణాలు పొందిన వివరాలు, తిరిగి చెల్లించిన వివరాలు, తీర్మానాలన్నీ తప్పుల తడకగా ఉన్నాయి. సభ్యురాలికి తెలియకుండానే ఆమె పేరుతో రుణం తీసుకొని ఇతరులకు ఇస్తున్నారు. దీంతో బ్యాంకు మేనేజర్ వారికి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.
నర్కూడ గ్రామంలోని ఓ మహిళా సంఘంలో సదరు వ్యక్తులు పుస్తకంలో పూర్తి స్థాయిలో వివరాలు నమోదు చేయలేదు. రుణాలు తీసుకోవడం కోసం తీర్మానం చేసిన వాటి వివరాలు సభ్యులకు చెప్పలేదని తమ దృష్టికి వచ్చింది. బుక్లో వివరాలు పరిశీలించగా అన్ని తప్పులు ఉన్నాయి. ఇలా తప్పులు చేస్తున్న సంఘాలపై ప్రత్యేక దృష్టి సారించి తగు చర్యలు తీసుకుంటాం.
– కెనరా బ్యాంకు మేనేజర్ సాగర్ రెడ్డి