Indiramma Indlu | చార్మినార్, జనవరి 4 : ఇందిరమ్మ ఇళ్ల సర్వే నిష్పక్షపాతంగా కొనసాగించేందుకు కృషి చేయాలని కోరుతూ బహదూర్పు, చాంద్రాయణగుట్ట , చార్మినార్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జిలు పులిపాటి రాజేశ్ కుమార్, బోయ నగేశ్, ముజీబుల్లాహ్ శనివారం చార్మినార్ జోనల్ అడిషనల్ కమిషనర్ శైలజను కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం సర్వే సిబ్బంది వ్యవహారం వల్ల అభాసు పాలవుతుందని అన్నారు.
నిజమైన నిరుపేదలను గుర్తిస్తూ వారికి ఇళ్లు అందించేందుకు నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన సిబ్బంది నిరుపేదల వద్ద ప్రతి కుటుంబం నుంచి రూ.300 నుంచి రూ. 3000 వేలు వసూళ్లు చేస్తున్నట్లు ఆధారాలు సైతం అందించామని తెలిపారు. సర్వే సిబ్బంది వ్యవహారంతో ప్రభుత్వానికి మచ్చతెచ్చే విధంగా ఉందని వాపోయారు. అవినీతికి పాల్పడుతున్న సిబ్బందిపై తక్షణం చర్యలు తీసుకుని, ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.