సిటీబ్యూరో, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): ఎస్పీడీసీఎల్ పరిధిలోని విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న అధికారుల అవినీతికి అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. గ్రేటర్ జిల్లాల పరిధిలో 3 జోన్లు, 10 సర్కిళ్లు, 29 డివిజన్లు, 72 ఆపరేషన్స్ సబ్ డివిజన్లు, 230 ఆపరేషన్ సెక్షన్లు ఉన్నాయి. మెట్రో, మేడ్చల్, రంగారెడ్డి జోన్ల పరిధిలో 60లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 53లక్షల గృహ, 8లక్షల వాణిజ్య కనెక్షన్లు ఉన్నాయి. కోర్‌సిటీలో పెద్దగా నిర్మాణాలు లేకపోవడంతో అక్కడ కొత్త కనెక్షన్ల కోసం వస్తున్న దరఖాస్తులు కూడా చాలా తక్కువగా ఉంటున్నాయి.
ఇదేసమయంలో శివారు ప్రాంతాలలో కొత్తగా విల్లాలు, హైరేజ్ బిల్డింగులు, పరిశ్రమలు వస్తున్నాయి. గ్రేటర్ జిల్లాలనుంచి ప్రతీ నెలా 35వేల మంది కొత్త కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. మల్టీస్టోరేజ్ భవనాలు, విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీల కోసం పెద్ద సంఖ్యలో ఎల్‌టీఎం దరఖాస్తులు వస్తుంటాయి. 20కిలోవాట్ల సామర్థ్యం దాటిన ఏదైనా ఒక బహుళ అంతస్తుల భవనానికి విద్యుత్ కనెక్షన్ కావాలంటే ముందు డిస్కంకు దరఖాస్తు చేసుకోవాలి. లైన్ ఇన్స్పెక్టర్, ఏఈలు క్షే్రత్రస్థాయిలో పర్యవేక్షించి ప్రస్తుతం మనుగడలో ఉన్న లైన్‌కు కొత్తగా నిర్మించే భవనానికి మధ్య ఉన్న దూరం సహా అందులో ఉన్న అంతస్తులు, ప్లాట్ల విస్తీర్ణం, విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని అంచనాలు రూపొందిస్తారు.
అయితే అంచనాల రూపకల్పనలో ముడుపులు చెల్లిస్తే ఒకలా, చెల్లించకపోతే మరోలా విద్యుత్ ఇంజనీర్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. శివారు ప్రాంతాలైన అమీన్పూర్, పటాన్చెరు, మేడ్చల్, కీసర, జీడిమెట్ల, హబ్సిగూడ, సరూర్‌నగర్, ఇబ్రహీంపట్నం, కందుకూరు, రాజేంద్రనగర్, గచ్చిబౌలి, కొండాపూర్, ఇబ్రహీంబాగ్, షాద్‌నగర్ తదితర డివిజన్ల పరిధిలో పెద్ద మొత్తంలో నూతన విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తులు వస్తున్నాయి.
ఇక్కడ దరఖాస్తు చేసుకున్న వారికి లైన్ ఫీజుబిలిటీ, లోడును సాకుగా చూపించి తక్కువ మొత్తానికి అయ్యే పనులకు ఎక్కువ మొత్తంలో అంచనాలు చూపిస్తున్నారు. ముడుపులు చెల్లిస్తే ఒకలా, లేకపోతే మరోలా.. ఒకే తరహా పనికి ఒక్కో ఇంజనీర్ ఒక్కో విధంగా ఎస్టిమేషన్లు వేస్తున్నారనే ఆరోపణలున్నాయి. మరికొంతమంది ఇంజనీర్లు తమకు ముందే అడిగినంత ముట్టజెప్పినవారికి తక్కువ ఖర్చుతో, నిరాకరించిన వారికి ఎక్కువ ఖర్చుతో ఎస్టిమేషన్లు వేస్తున్నారని వినియోగదారులు డిస్కంకు ఫిర్యాదు చేశారు.
ఒక్కొక్కరిది ఒక్కో రేటు..
క్షేత్రస్థాయిలో విద్యుత్ కనెక్షన్లకు తీసుకునే సంయంలో ఒక్కో ఇంజనీర్, అధికారులు ఒక్కోరేటు ఫిక్స్ చేస్తున్నారు. వినియోగదారులకు అనుకూలమైన ఎస్టిమేషన్ తయారుచేయాలంటే ముందే ఏఈకి రూ.20వేలు, ఏడీఈ రూ.10వేలు, డీఈకి రూ.10వేలు, ఎస్ఈకి రూ.10వేలు చెల్లించాల్సి వస్తోందని.. తర్వాత వర్క్ ఆర్డర్‌కు ఏఈ, ఏడీఈలకు రూ.10వేలు చెల్లించాల్సి వస్తోందంటూ వినియోగదారులు వాపోతున్నారు. మెటీరియల్ ధరల్లోనూ భారీ వ్యత్యాసాలు ఉండటం కూడా ఇబ్బందిగా మారింది. బహిరంగ మార్కెట్లో రూ.10వేలకు లభించే వస్తువుకు, డిపార్ట్మెంట్లో రూ.15వేలకు పైగా ఖర్చవుతోంది. తీరా పని పూర్తయిన తర్వాత డీటీఆర్ చార్జింగ్ సమయంలో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌కు లింక్‌పెట్టి లైన్ ఇన్స్పెక్టర్ మొదలు ఉన్నతాధికారుల వరకు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. అదనపు చెల్లింపులు భారంగా మారుతుండటంతో విధిలేని పరిస్థితుల్లో వినియోగదారులు, కాంట్రాక్టర్లు ఏసీబీని ఆశ్రయిస్తున్నారు.
ఇటీవల ఒక రియల్ఎస్టేట్ వ్యాపారి హైదరాబాద్ శివారులో ప్లాట్లతో వెంచర్ వేసి కరెంట్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మొదట ఇంజనీరు వద్దకు వెళ్లగా రూ.13లక్షల వరకు అంచనా అవుతుందని ఎస్టిమేషన్ ఇచ్చారు. ఇది చాలా ఎక్కువని భావించి కాంట్రాక్టర్ వద్దకు వెళ్తే రూ.15లక్షలని చెప్పారు. దీంతో ఎస్పీడీసీఎల్ ప్రధానకార్యాలయంలో పరిచయమున్న ఓ ఉన్నతాధికారిని సంప్రదించారు. ఆయన శాస్త్రీయంగా అంచనా వేయించగా రూ.6.70లక్షల వ్యయమవుతుందని తేలింది. ఇది క్షేత్రస్థాయిలో ఇంజనీరు అంచనా కన్నా రూ.6.3లక్షలు తక్కువ కావడం గమనార్హం.
ఇబ్రహీంబాగ్ ప్రాంతానికి చెందిన ఓ వినియోగదారుడు తనకున్న స్థలంల్లో నాలుగు అంతస్తుల భవనాన్ని నిర్మించారు. ఒక్కో ఫ్లోర్లో రెండు ఫ్లాట్ల చొప్పున మొత్తం ఎనిమిది త్రీఫేజ్ విద్యుత్ మీటర్లకు దరఖాస్తు చేసుకున్నాడు. ఒక్కో మీటర్ ఐదుకిలోవాట్ల చొప్పున మొత్తం 40 కిలోవాట్ల డిమాండ్ ఉన్న అప్పటికే ఉన్న మీటర్‌తో కలిపి డిమాండ్ 45 కిలోవాట్లకు చేరుకుంది. ఇందుకు 63కేవీ సామర్ధ్యంతో డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్, 35స్కేర్ ఎంఎం సామర్థ్యంలో 11కేవీ కేబుల్, ఒక పోల్, ఒక ఏబీస్విచ్, ఫ్యూజ్ సర్క్యూట్, డీటీఆర్బాక్స్, ఐదు ఎర్తింగ్ ఫిట్స్, ఒక పానల్ బోర్డు, డీటీఆర్ నుంచి పానల్బోర్డు వరకు కేబుల్ అవసరం. ఇందుకు సుమారు రూ.3లక్షలు ఖర్చవుతుంది. కానీ అడిగినంత ఇవ్వలేదనే సాకుతో ఆ ఇంజనీరు ఇదే పనికి అంచనాలకు మించి రూ.6.5లక్షలు ఎస్టిమేషన్ వేశారు.