సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో జనన, మరణ ధ్రువపత్రాల జారీ ప్రక్రియలో తీవ్ర జాప్యం, కొన్ని చోట్ల తప్పుల తడకగా సర్టిఫికెట్ల జారీ అవుతున్న నేపథ్యంలో దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల జారీలో అత్యంత కీలకమైన దవాఖానల నిర్వాహకులు, సిబ్బందిపై అవగాహన కల్పించాలని నిర్ణయించారు. బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల జారీలో తీవ్ర జాప్యం నెలకొందని, కరెక్షన్ ఫైళ్లు పెండింగ్లో ఉంటున్నాయని పేర్కొంటూ ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.
ఈ మేరకు మంగళవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జీహెచ్ఎంసీ వైద్యాధికారులు, ఉన్నతాధికారులు కలిసి ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల ఆసుపత్రుల సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు. బర్త్, డెత్ సర్టిఫికెట్లలో ఎలాంటి తప్పులు దొర్లవద్దని, ఒకటి రెండు సార్లు సరి చూశాకే వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని దిశానిర్ధేశం చేయనున్నారు.