సిటీబ్యూరో, జనవరి 7 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీ అసలే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది.. ఉద్యోగుల జీతాలే సక్రమంగా చెల్లించలేని దుస్థితి.. అపై గ్రేటర్ సమస్యల వలయంలో ప్రజలు నలిగిపోతున్న పరిస్థితి. రోడ్లపై అడుగు తీసి అడుగు వేయాలంటే గుంతల గండం.. డ్రైనేజీలు పొంగిపొర్లి బస్తీలు మురుగుకూపాలవుతున్నాయి.. సామాన్యుడు పన్నులు కట్టలేక ఇబ్బందులు పడుతుంటే..ఆ పన్నుల సొమ్ముతో మన గ్రేటర్‌లోని కొందరు కార్పొరేటర్లు మాత్రం గుజరాత్ బీచ్‌ల్లో ఎంజాయ్ చేస్తున్నారు.
అహ్మదాబాద్‌లోని సబర్మతి రివర్ ఫ్రంట్ అభివృద్ధి అధ్యయనం (స్టడీ టూర్) చేస్తామంటూ.. వెళ్లిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి నాయకత్వంలోని పలువురు కార్పొరేటర్లు అక్కడ ‘స్టడీ’ని గాలికొదిలేసి.. ‘సైట్ సీయింగ్’లో బిజీగా ఉన్నారు. నది తీరంలో చిందులు వేస్తూ, షాపింగ్‌లు చేస్తూ జనం సొమ్మును వృథా చేస్తున్నారు. అధ్యయనమా? అస్మదీయుల విహారయాత్రనా? పట్టుమని 33 రోజుల్లో ప్రస్తుత పాలకవర్గం పదవీ కాలం ముగుస్తున్న వేళ.. అధ్యయనం పేరిట కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని నీళ్లలా ఖర్చు చేస్తున్న తీరు తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.
అహ్మదాబాద్ స్టడీ టూర్ కోసమని..
గ్రేటర్ హైదరాబాద్‌లో 121 మంది కార్పొరేటర్లు స్టడీ టూర్‌ను ప్లాన్ చేసుకుని ఓ ట్రావెల్స్ ఏజెన్సీకి ఒకొకరికి రూ. లక్ష చొప్పున బేరం కుదుర్చుకుని ఎంఐఎం పార్టీ మినహా మిగిలిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన 35 మంది కార్పొరేటర్ల మొదటి బృందం అహ్మదాబాద్ స్టడీ టూర్ కోసం ఈ నెల 6న బయల్దేరి వెళ్లింది. అహ్మదాబాద్ లో ల్యాండ్ అయిన కార్పొరేటర్ల బృందం మొదటి రోజు ద్వారక నగరాన్ని దర్శించుకుని, ఆ తర్వాత బీచ్‌లో ఫొటోలకు ఫోజులిచ్చారే తప్పా, అహ్మదాబాద్ నగరంలోని ఏ ఒక అంశంపై ఎలాంటి స్టడీ చేయలేదని తెలుస్తున్నది.
సాధారణంగా ఇలాంటి స్టడీ టూర్లకు వెళ్లే కార్పొరేటర్లు తాము ఎంచుకున్న నగర స్థానిక మున్సిపల్ అధికారులను, పాలక మండలి పెద్దలను కలిసి అకడ ప్రజలకు అందిస్తున్న సేవల గురించి, అధ్యయనం చేసి, వారి నగరానికి అవసరమైన అంశాలను తెలుసుకుని, టూర్ ముగిసిన తర్వాత తమ నగరంలో ఆ అంశాలను అమలు చేసేందుకు ప్రయత్నం చేయాలన్నది స్టడీ టూర్ తాత్పర్యం. ఈ నేపథ్యంలోనే అహ్మదాబాద్ టూర్‌కు వెళ్లిన పనేంటి? చేస్తుందేమిటీ? అంటూ మేయర్ బృందంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి.
సకుటుంబ సపరివారంగా..
కార్పొరేటర్ అయినా, మహిళా కార్పొరేటర్ అయినా కేవలం సభ్యులను మాత్రమే టూర్‌కు తీసుకెళ్తున్నట్లు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి స్పష్టం చేశారు. ఈ మేరకు స్టాండింగ్ కమిటీలో పెట్టిన ప్రతిపాదన ప్రకారం పాలక మండలిలో సభ్యులుగా పరిగణించే కార్పొరేటర్ల మాత్రమే స్టడీ టూర్‌కు వెళ్లాలని నిబంధన పెట్టుకున్నారు. కానీ ఆ తర్వాత సీన్ మారిపోయింది. మహిళా కార్పొరేటర్ల భర్తలు, కార్పొరేటర్ల భార్యలు, పిల్లలు, బంధువులను కూడా తీసుకుని స్టడీ టూర్ పేరిట ఫ్యామిలీ టూర్‌కు వెళ్లారు. ఇందుకు సోషల్ మీడియాలో తిరుగుతున్న ఫొటోలే ఇందుకు నిదర్శనం. కేవలం పాలక మండలి సభ్యులైన కార్పొరేటర్ల స్టడీ టూర్ కోసం సుమారు రూ. కోటిన్నర వరకు ఖర్చవుతుందని వేసిన అంచనాలన్నీ ఇప్పుడు తారుమారు అయ్యాయని తెలుస్తున్నది.
బసకు ఐదు నక్షత్రాల హోటళ్లు, ప్రయాణానికి విమానాలు, షాపింగ్‌లకు స్పెషల్ వెహికల్స్..ఇలా ప్రతి పైసా జనం పన్నుల నుంచే ఖర్చువుతుండడం గమనార్హం. ఈ క్రమంలోనే ఈ టూర్ ఫ్యామిలీ టూర్‌గా మారినందున అంచనా వేసిన ఖర్చు రెండింతలయ్యే అవకాశాలున్నాయన్న చర్చ జరుగుతున్నది. కొందరు కార్పొరేటర్లు మందు పార్టీలకు పరిమితం కాగా, మరి కొందరు బీచ్‌లో ఫొటోలకు ఫోజులివ్వటానికే ఎకువ ప్రాధాన్యతనిచ్చినట్లు సమాచారం. కాగా ఈ నెల 16న రెండో బృందం బయలుదేరనున్నట్లు సమాచారం. ఈ బృందంలో కూడా కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన సభ్యలుండగా, ఎంఐఎం పార్టీకి చెందిన కార్పొరేటర్లు అజ్మీర్ దర్గాకు వెళ్లేందుకు స్పెషల్‌గా ప్లాన్ చేసినట్లు సమాచారం. మొత్తంగా స్టడీ టూర్ల పేరిట జీహెచ్ఎంసీ నిధులను నీళ్లలా ఖర్చు చేయడం పట్ల నగరవాసులు తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.