బంజారాహిల్స్, డిసెంబర్ 5: యూబీడీ అధికారులు.. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సిబ్బందిని షేక్‌పేట డివిజన్ కార్పొరేటర్‌కు చెందిన ఫాంహౌజ్‌లో పనులు చేసేందుకు పంపించడం వివాదాన్ని రాజేసింది. షేక్‌పేట డివిజన్ కార్పొరేటర్ ఫరాజుద్దీన్ ఇటీవల యూబీడీ(అర్బన్ బయోడైవర్సిటీ) అధికారులకు ఫోన్లు చేసి చిలుకూరు సమీపంలోని తన ఫాంహౌజ్‌లో మొక్కలు నాటడంతో పాటు కొన్ని పనులు ఉన్నాయని, ఇందుకోసం యూబీడీ ఆధ్వర్యంలోని కార్మికులను పంపించాలంటూ.. హుకుం జారీ చేశాడు. దీంతో స్థానికంగా యూబీడీ సూపర్వైజర్ ఆంజనేయులు, యూబీడీ మేనేజర్ జ్యోత్స్న ఆదేశాలతో సర్కిల్-18లో పనిచేస్తున్న ఏడుగురు కార్మికులు 5 రోజుల పాటు చిలుకూరు సమీపంలోని కార్పొరేటర్ ఫరాజుద్దీన్‌కు చెందిన ఫాంహౌజ్‌లో పనిచేశారు.
కాగా, గురువారం ఈ వ్యవహారంపై జీహెచ్ఎంసీ యూబీడీ విభాగం ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందడంతో కలకలం చెలరేగింది. సర్కిల్-18లో పనిచేయాల్సిన కార్మికులు కార్పొరేటర్‌కు చెందిన ప్రైవేటు ఫాంహౌజ్‌లో పనులు చేసిన వ్యవహారంపై విచారణ చేయాలని యూబీడీ అదనపు కమిషనర్ సునంద ఆదేశించారు. షేక్‌పేట ప్రాంతంలోని పార్కుల వ్యవహారాలు చూసే సూపర్వైజర్ ఆంజనేయులు, బంజారాహిల్స్ ప్రాంతంలోని పార్కుల వ్యవహారాలు చూసే పవన్, సర్కిల్-18 యూబీడీ విభాగం మేనేజర్ జ్యోత్స్నల ఆదేశాలతోనే కార్మికులు ఏ మాత్రం సంబంధం లేని చిలుకూరు సమీపంలోని కార్పొరేటర్ ఫాంహౌజ్‌లో పనుల కోసం వెళ్లినట్లు తేలింది.
చాలాకాలంగా ఇదే తరహాలో యూబీడీ విభాగం కార్మికులను కొందరు కార్పొరేటర్లు, జీహెచ్ఎంసీ అధికారులు, ప్రజాప్రతినిధులు సొంత పనుల కోసం వాడుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. యూబీడీ విభాగం అధికారుల నిర్లక్ష్యంతో పాటు అవినీతి వ్యవహారాలపై ఆయా కార్పొరేటర్లు, అధికారులు బ్లాక్ మెయిల్ చేయడంతోనే సొంత పనుల కోసం కార్మికులను పంపిస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. వెంటనే ఈ ఘటనకు కారణమైన యూబీడీ అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.