సిటీబ్యూరో, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): ‘జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీవ్ యాదవ్ ఎమ్మెల్యేగా గెలుస్తే..బోరబండలో తానే ఎమ్మెల్యేగా కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ రెచ్చిపోతారు. బాబా అరాచకాలకు అడ్డు అదుపు ఉండదు. చిరు వ్యాపారుల నుంచి బడా వ్యాపారుల దాకా బాబా వేధింపులకు గురికావాల్సిందే. బాబా వేధింపుల కారణంగా సర్దార్ చనిపోయారు.’ ఈ మాటలు స్వయంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్పొరేటర్‌గా కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన వ్యక్తి అన్నవి. బోరబండ నుంచి 2021లో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన షేక్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు పెను దుమారాన్ని రేపుతున్నాయి.
ఇటీవల షేక్ షరీఫ్ ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బోరబండ కాంగ్రెస్ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్‌పై చేసిన సంచలన వ్యాఖ్యలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. షరీఫ్ వ్యాఖ్యలకు సంబంధించిన ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. బోరబండలో బాబా అక్రమాలకు లెక్కేలేదని, సామాన్యులు, వ్యాపారస్తులే టార్గెట్‌గా చేసుకొని వేధింపులకు గురి చేస్తున్నారని ఇంటర్వ్యూలో షరీఫ్ వ్యాఖ్యానించారు. ఆయన వేధింపులకు ఇటీవల మైనార్టీ నాయకుడు సర్దార్ ఆత్మహత్య చేసుకున్నకాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న తనను పక్కన బెట్టి, గ్రూప్ రాజకీయాలకు తెరలేపిన నాయకుడు బాబా అని షరీఫ్ ఆరోపించారు. బోరబండ బస్‌స్టాప్‌లో ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఏసీ బస్సు షెల్టర్‌ను ఏకంగా తన అనుచరులకు అప్పగించి.. వ్యాపార కేంద్రంగా మార్చిన ఘనత బాబాకే దకిందన్నారు.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఓటమి పాలైతే, అందుకు బోరబండ కాంగ్రెస్ కార్పొరేటర్ బాబానే కారణం అవుతారని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. బోరబండ రోడ్డు విస్తరణ జరగకుండా అడ్డుకున్నది కూడా బాబానేనని ఆరోపించారు. బోరబండ బస్ స్టాప్ సమీపంలో వినాయకరావు నగర్ కమ్యూనిటీ హాల్లో ప్రాథమిక పాఠశాల ఉండేదని తన అనుచరుడికి లాభం చేకూర్చేందుకు, అధికారాన్ని దుర్వినియోగం చేసి పాఠశాల భవనాన్ని కూలగొట్టించారని మండిపడ్డారు. బాబా నిర్వాకంతో అనేకమంది పేద విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఇదేంటని ప్రశ్నించిన తనపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని షరీఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. బోరబండ ప్రజలు.. కార్పొరేటర్ బాబా పేరు వింటేనే భయపడే పరిస్థితిలో ఉన్నారని, ఇది కాంగ్రెస్ పార్టీకి తీవ్రనష్టం కలిగిస్తుందని వాపోయారు. షరీఫ్ మాట్లాడిన ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తుంది. ఇది చూసిన నెటిజన్లు కాంగ్రెస్ నేత బాబా తీరును తప్పు పడుతున్నారు. తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.