సిటీబ్యూరో, జూలై 5 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్ పౌరులపై ప్రభుత్వం మరో పన్నుల పిడుగు వేయడానికి సిద్ధమైంది. ఇప్పటి వరకు ఉన్న ‘వార్షిక అద్దె విలువ’ స్థానంలో.. ఇకపై క్యాపిటల్ వ్యాల్యూ’ ఆధారంగా ఆస్తి పన్నును లెకించనున్నారు. ట్రై కార్పొరేషన్లు (జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ) పరిధిలో ప్రభుత్వం కోర్ అర్భన్ రీజియన్ (ఇంటిగ్రేడెట్ గవర్నెన్స్) బిల్లు -2026 క్యూర్ బిల్లును తీసుకువస్తున్న సంగతి తెలిసిందే.. ఈ నయా చట్టం అమల్లోకి వస్తే గ్రేటర్ పరిధిలోని 19.49 లక్షల మంది ఆస్తిపన్ను యజమానులపై పన్నుల భారం రెట్టింపు కావడం ఖాయంగా కనిపిస్తోంది.
ప్రస్తుతం నగరంలో నివాస, వాణిజ్య సముదాయాలకు వాటి విస్తీర్ణం, ప్రాంతాన్ని బట్టి వచ్చే అద్దె ఆధారంగా నామమాత్రంగా పన్నులు విధిస్తున్నారు. కానీ కొత్త విధానం ప్రకారం.. ఆయా ప్రాంతాల్లో ఉన్న భూమి రిజిస్ట్రేషన్ విలువ లేదా మారెట్ రేట్ల ఆధారంగా పన్ను నిర్ణయిస్తారు. ఉదాహరణకు, ఐటీ కారిడార్, నగరంలోని ప్రధాన కూడళ్లలో ఒక సాధారణ ఇంటి మారెట్ విలువ కోట్లలో ఉంటుంది. ఇప్పుడు కొత్త చట్టం వల్ల ఆ భారీ ‘క్యాపిటల్ వ్యాల్యూ’పై పన్ను లెకగడితే, ఏటా కట్టే ఆస్తి పన్ను భారం ఊహించని స్థాయికి చేరుకుంటుంది. దీంతో ఇటు సొంత ఇల్లు ఉన్న వారు, అటు అద్దె ఇండ్లలో ఉండే సామాన్యులు కూడా పెరగబోయే అద్దెల భారాన్ని తలచుకుని గుండెలు బాదుకునే పరిస్థితి రాబోతుండడం గమనార్హం.
గ్రేటర్ పౌరుడిపై ప్రభుత్వం ఏ ఒక కోణంలోనూ కరుణ చూపడం లేదు. ఇప్పటికే భూముల ప్రభుత్వ విలువలను పెంచేసి రిజిస్ట్రేషన్ల భారాన్ని భారీగా పెంచేసింది. సొంతింటి కల నిజం చేసుకోవాలనుకునే సగటు జీవికి రిజిస్ట్రేషన్ల భారం ఇప్పటికే నడ్డి విరిచింది.. ఆ భారం నుంచి కోలుకోకముందే, త్వరలో ట్రై కార్పొరేషన్లలో ఒకే పన్ను విధానం ఆమల్లోకి తీసుకువచ్చేందుకు సిద్దమైంది. దీంతో మారెట్ ధరల ఆధారంగానే ఆస్తి పన్ను కూడా లెకిస్తామనడం పౌరులను నిలువునా ముంచడమేనని నిపుణులు మండిపడుతున్నారు. ఒకవైపు ఆదాయాలు పెరగక, మరోవైపు పెరిగిన జీవన వ్యయంతో కొట్టుమిట్టాడుతున్న సగటు పౌరుడిపై ఈ ‘క్యాపిటల్ వ్యాల్యూ’ పన్ను విధానం కోలుకోలేని దెబ్బ కానుంది. ఇటు అద్దెకు ఉండేవారిపై కూడా ఈ ప్రభావం పడనుంది. యజమానులు పన్నుల భారాన్ని అద్దెల రూపంలో సామాన్యులపైకి నెట్టే ప్రమాదం ఉంది. ఆదాయ వనరులను పెంచుకునేందుకు ప్రజల రక్తాన్ని పిండటమే లక్ష్యంగా సరార్ సాగిస్తున్న ఈ పన్నుల వేటపై గ్రేటర్ పౌరుల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి..
ప్రభుత్వ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీతో పాటు సైబరాబాద్, మల్కాజిగిరి నగర పాలక సంస్థల పరిధిలో ఒకే రకమైన పన్ను విధానాన్ని ఆమలు చేయబోతున్నది. ఐతే ప్రస్తుతం వేర్వేరుగా ఉన్న పన్నుల లెకలను సరిచేసి, మూడు కార్పొరేషన్లను ఒకే గొడుగు కింద తీసుకువస్తున్నది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్లో రెంటల్ వాల్యూ ( అద్దె ఆధారిత) పద్ధతిలో పన్నులు కడుతుండగా..జీహెచ్ఎంసీలో విలీనమైన 27 పురపాలికల్లో మాత్రం రిజిస్ట్రేషన్ శాఖ నిర్దేశించిన మార్కెట్ వాల్యూ ప్రకారం పనులు వసూలు చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో ఒకలా, శివారు మున్సిపాలిటీల్లో మరోలా పన్నుల వసూళ్లు ఉండటంతో గందరగోళ పరిస్థితులకు తెరదించాలని భావించింది.
ఈ ముసుగులో ఆస్తిపన్ను విధానంలో మార్కెట్ వాల్యూ ప్రకారం తీసుకువచ్చి గ్రేటర్ ప్రజలపై తీవ్ర భారం మోపేందుకు రంగం సిద్ధం చేసింది. మార్కెట్ వాల్యూ ప్రకారం ఆమలు చేస్తే ప్రస్తుతం ఉన్న ఆస్తిపన్ను చెల్లింపులు మూడు నుంచి నాలుగు రేట్ల అధిక భారం పడే అవకాశాలున్నాయని కొందరు అధికారులు పేర్కొంటున్నారు. కార్పొరేషన్ల విభజన ముసుగులో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజలపై పన్నుల భారం మోపుతుండడం విస్తృత చర్చనీయాంశంగా మారింది.
ఆస్తిపన్ను రివిజన్ ముసుగులో ఇప్పటికే యజమానులకు అధికారులు నోటీసులు జారీ చేశారు. సంబంధిత యజమానికి సంబంధించి సేల్డీడ్ (అటెస్టేషన్తో కూడినది), లింకు డాక్యుమెంట్లు (ఏవైనా ఉంటే), సాంక్షన్డ్ ప్లాన్/పర్మిట్ కాపీ, రిజిస్టర్డ్ లీజ్ డీడ్ కాపీ, మున్సిపల్ పన్ను రసీదు, అక్యుపేషన్ తేదీ (నివాసం ప్రారంభించిన తేదీ), అక్యుపేషన్ సర్టిఫికెట్ వివరాలను నోటీసులు అందిన మూడు రోజుల్లోగా సమర్పించాలని అధికారులు చెబుతున్నారు. సమయానికి వివరాలు సమర్పించని పక్షంలో సెక్షన్ 176, 177 ప్రకారం శిక్షార్హులవుతారని అధికారులు హెచ్చరించారు. నిర్ధేశిత గడువులోగా వివరాలు ఇవ్వకపోతే అధికారులే స్వయంగా క్షేత్రస్థాయి పరిశీలన జరిపి ఆస్తి విలువను నిర్థారిస్తారని, చట్టపరమైన తదుపరి చర్యలు ఉంటాయని నోటీసుల్లో స్పష్టం చేశారు. దీంతో ఆస్తుల యజమానుల్లో ఒక్కసారిగా కలవరం మొదలైంది.