సిటీబ్యూరో, మార్చి 26 (నమస్తే తెలంగాణ) : రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రేటర్ పౌరులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టేందుకు పోలీస్ , జీహెచ్ఎంసీ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించాయి. బషీర్ బాగ్‌లోని పాత పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో గురువారం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆధ్వర్యంలో కన్వర్జెన్స్ సమన్వయ సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించిన అధికారులు క్షేత్రస్థాయి సిబ్బందికి స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. వర్షాలు మొదలైన తర్వాత కాకుండా, ఇప్పటి నుంచే యుద్ధప్రాతిపదికన డ్రైనేజీ పూడికతీత, పైప్ లైన్ల మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. నగరంలో ప్రధానంగా గుర్తించిన టాప్ 10 వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద తక్షణమే పనులు ప్రారంభించి శాశ్వత పరిషారం చూపాలని, అలాగే ప్రజల ప్రాణాలకు ముప్పు కలుగకుండా తెరిచి ఉన్న మ్యాన్‌హోల్స్‌కు పటిష్టమైన మూతలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు.
రోడ్ల అభివృద్ధికి నిధులు
వర్షాకాలంలో ఆస్తి, ప్రాణ న ష్టం కలగకుండా చూడటమే అధికారుల ప్రాథమిక బాధ్యత అని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అన్నారు. పోలీసు విభాగంతో కలిసి పనిచేస్తూ నగర మౌలిక సదుపాయాలను మరిం త మెరుగుపరుస్తామని, నగర సుందరీకరణతో పాటు రహదారుల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తామన్నారు. నగరంలో ట్రాఫిక్ సమస్య పరిషారానికి, రోడ్ల అభివృద్ధికి సంబంధించి ప్రత్యేకంగా రూ.150 కోట్ల నిధులను కేటాయించినట్లు కమిషనర్ వెల్లడించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ఒకో జోన్‌కు రూ. 25 కోట్ల చొప్పున ఈ నిధులను కేటాయించామని, వీటి ద్వారా ట్రాఫిక్ నియంత్రణకు అవసరమైన పనులను చేపడుతామని ఆయన వివరించారు.