సిటీబ్యూరో, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): ఆ అమ్మవారి ఆలయంలో బంగారు కానుకలకు కొదువే లేదు. దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులతో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అమ్మవారి ఆలయానికి క్రమం తప్పకుండా వచ్చే భక్తులు తమ ఇలవేల్పుకు బంగారం, వెండి, డబ్బులు, చీరెల రూపంలో పెద్ద ఎత్తున కానుకలు సమర్పించుకుంటారు.
దేశంలోనే ప్రముఖ వ్యాపారవేత్త, అందరితో తన వ్యాపారాలతో నిరంతరం కనెక్ట్ అయి ఉండే కంపెనీ అధినేత భార్య ఇటీవల అమ్మవారికి కోటి రూపాయల విరాళం ఇచ్చారు. ఇలాంటి భక్తులు అమ్మవారికి వందల సంఖ్యలో ఉంటారు. అందుకే ఏ యేటికాయేడు అమ్మవారి ఆదాయం పెరుగుతూ వస్తోంది. అయితే ఈ కానుకలకు గతంలో భద్రత ఉండేది. వాటి విషయంలో గత అధికారులు భయం భక్తులు ప్రదర్శించేవారు. కానీ ఈ అధికారి మాత్రం తన వైఖరి మార్చుకోకుండా ఆలయంలో తన వర్గం వారైన అర్చకుడు, సీనియర్ ఉద్యోగితో కలిసి వాటాల దందా మొదలుపెట్టారు.
బంగారం భద్రంగా ఉందా..!
అమ్మవారికి భక్తులు తమ మొక్కుబడులను బంగారం రూపంలో చెల్లించుకుంటున్నారు. ఆ అమ్మవారిని కోరుకున్న కోరికలు తీరగానే మొక్కుల రూపంలో ఆభరణాలు చేయిస్తుంటారు. ఈ బంగారు ఆభరణాలు దేవాలయ అధికారి పర్యవేక్షణలో ఉండాలి. వాటి వివరాలు పూర్తిగా అతని వద్ద రికార్డయి ఉండాలి. కానీ ఆ ఆలయంలో మాత్రం తాము విరాళంగా ఇచ్చి రికార్డులకెక్కని బంగారు వస్తువులపై దాతల నుంచి ఫిర్యాదులొస్తున్నాయి.
ఇటీవల నగర శివారులోని ఓ ప్రాంతానికి చెందిన దాత అమ్మవారికి రూ.16 లక్షల విలువైన ఆభరణాన్ని తయారు చేయించి ఆలయ అర్చకుడికి ఇచ్చి దసరా ఉత్సవాల్లో అమ్మవారికి అలంకరించాలని కోరారు. కానీ తాము ఇచ్చిన ఆభరణానికి రసీదు ఇవ్వకపోగా, ఎప్పటికప్పుడు సమాధానాలు వాయిదా వేస్తూ ఉండడంతో ఇటీవల ఆ దాత ఆలయ అధికారికి ఫిర్యాదు చేశారు.
అయితే దాతలు చేయించిన ఆభరణం గతంలో అమ్మవారికి ఉన్న ఆభరణం, కొత్తగా దాత ఇచ్చిన ఆభరణం ఒకేలా ఉండడంతో ఆలయంతో సంబంధమున్న దాతలకు, భక్తులకు అనుమానమొచ్చిందని, ఈ వ్యవహారంపై విచారణ చేపట్టి రెండు ఆభరణాలు ఉన్నాయా లేదా అనేది తేల్చాలని కోరినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదని దాతలు అంటున్నారు. అయితే ఆ అధికారి మాత్రం తన హయాంలో జరగని వ్యవహారానికి తానెందుకు బాధ్యత వహించాలంటూ మౌనం పాటించినా.. దాతలు మాత్రం ఈ విషయంలో ఉన్నతాధికారుల వరకు ఫిర్యాదు చేస్తామని బెదిరించడంతో రసీదు ఇచ్చారని భక్తులు చెప్పారు.
ఈ వ్యవహారంలో నగను తీసుకున్న అర్చకుడిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా వెనకేసుకొస్తున్నది మాత్రం సదరు ఆలయ అధికారేనంటూ ఆలయవర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. ఇందుకు కారణం వారిద్దరూ ఒకే వర్గానికి చెందినవారని, వారికి తోడు అర్చకుడి రక్త సంబంధీకుడైన ఓ ఉద్యోగి వేరే దేవాలయం నుంచి ఉత్సవాలకు ముందు ఈ ఆలయానికి వచ్చారు. అప్పటినుంచి ఈ ముగ్గురు కలిసి ఆలయ ఆదాయానికి, విరాళాలకు గండికొడుతున్నారంటూ దేవాదాయశాఖలో చర్చ జరుగుతోంది. ఈ ముగ్గురు ఇంతగా రెచ్చిపోవడానికి వారి వర్గానికే చెందిన మంత్రి అండదండలతో పాటు దేవాదాయ శాఖామంత్రి పేషిలో ఉండే ఓ కీలక అధికారి వత్తాసు పలకడమే కారణమంటూ వారు చెప్పుకొంటున్నారు.
బంగారం విషయంలో..
బంగారం విషయంలో ఎవరైనా తనను ప్రశ్నిస్తే గతంలో పనిచేసిన అధికారులు తనకు బంగారం వివరాలు ఇవ్వలేదని చెప్పుకొంటానంటూనే అదే సాకుతో ఆలయంలో ఉన్న బంగారంతో పాటు దాతలు ఇచ్చే బంగారంలో కూడా వాటాలు పంచుకునేందుకు ఆ ముగ్గురు సిద్ధమైనట్లు దేవాదాయశాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతెందుకు.. ఆ అధికారి బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఇప్పటివరకు వచ్చిన బంగారు వస్తువుల లెక్క విషయంలో చాలా తేడాలున్నాయని భక్తులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా తాము చేయించిన ముక్కుపుడకల విషయంలో అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అమ్మవారికి కనిపించే ముక్కుపుడక వంటిదే మరొకటి చేయించేలా సదరు అర్చకుడు దాతలకు ఫొటోలు పంపించి చేయించమని, అవే రాళ్లు, అదే సైజులో అంటూ అన్ని వివరాలు పంపించి ఆ ముక్కుపుడక తెచ్చిన తర్వాత అలంకారం చేసినట్లు చూపించి తర్వాత అవి తమ ఖాతాలో వేసుకుంటున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ మధ్యకాలంలో వచ్చిన వస్తువుల్లో చాలావాటికి రసీదులు ఇవ్వడం లేదని, అర్చకుడు, అధికారి, సీనియర్ ఉద్యోగి కలిసి వాటిని కనిపించకుండా చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. అమ్మవారికి వచ్చే చీరెల్లోనూ వీరి చేతివాటం చూపిస్తున్నారని, గతంలో ఉత్సవాల్లో అలంకారానికి ఇచ్చిన ఎనభైవేల రూపాయల పట్టుచీరె కూడా కనిపించకుండా పోయిందని, ఇప్పుడు ఈ అధికారి వచ్చిన తర్వాత చీరెల లెక్కే తేలడం లేదని ఆలయంలో చర్చ జరుగుతోంది.
విరాళాలలో వాటాలు..!
తన పదవీకాలం ముగిసి ఆలయంపై ఎలాంటి అధికారం లేకున్నా అక్కడ జరిగే ప్రతీ వ్యవహారంలో తన మద్దతుదారుల సహకారంతో కీలకపాత్ర పోషిస్తున్న ఆ అధికారి గతంలో జరిగిన పనులకు బిల్లులు ఇవ్వడంతో పాటు, లడ్డూ ప్రసాదం, దాతల విరాళాలలో చేతివాటం కనబరుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. నెలరోజుల కాలంలో సుమారు రూ. 25 లక్షలకుపైగా డబ్బుల పంపకాల విషయంలో అధికారి పాత్ర ఉన్నప్పటికీ దేవాదాయశాఖ ఉన్నతాధికారులు ఆయనను అడగడానికి ధైర్యం లేదని, ‘నా జోలికి వచ్చే ధైర్యమెవరికి ఉందం’టూ బాహాటంగా వ్యాఖ్యానిస్తున్నట్లు ఆలయానికి వచ్చే రెగ్యులర్ భక్తులు అంటున్నారు.
అంతేకాదు శనివారం జరిగిన ట్రాన్స్ఫర్స్లో పాత అధికారికి వేరే బాధ్యతలు ఇవ్వడంతో ఇక ఈ గుడి తన సొంతమని, మా వాళ్లు ఉండగా నన్ను ఎవరేం చేస్తారంటూ గుళ్లోనే బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారని భక్తులు చెప్పారు. ముఖ్యంగా గతంలో ఆలయంలో జరిగిన ఓ దొంగతనం కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని గర్భగుడిలో పనిచేయించడమే తప్పని, కానీ ఇప్పటికీ ఆయన కేసుపై కోర్టులో విచారణ జరుగుతున్నప్పటికీ దేవాదాయశాఖ నిబంధనలకు విరుద్ధంగా గర్భగుడిలో డ్యూటీలు వేస్తూ ఆ అధికారి తన పబ్బం గడుపుకొంటున్నారంటూ బస్తీవాసులు చెప్పుకొంటున్నారు.
గతంలో ఈ బస్తీవాసులు కొందరు అర్చకుడి తీరుపై దేవాదాయశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా అర్చకుడు తన పలుకుబడితో గర్భగుడిలో పనిచేస్తున్నారని వారు చెప్పుకొంటున్నారు. అయితే ఈ అర్చకుడిని గత అధికారి సమయంలో పెద్దగా ప్రోత్సహించకపోవడంతో మల్కాజిగిరికి చెందిన ఓ నేతను తీసుకొచ్చి ఆ అధికారిని బెదిరించారని ఆలయ వర్గాలు చెప్పాయి.
అంతేకాదు.. తన డ్యూటీ విషయంలో ఎవరు జోక్యం చేసుకున్నా.. సీరియస్‌గా ఉంటుందంటూ ఆ అర్చకుడు అందరికీ వార్నింగ్ కూడా ఇచ్చారట. కొత్తగా తన వర్గానికి చెందిన అధికారి వచ్చిన తర్వాత ఆ అర్చకుడి ఆగడాలకు అంతేలేకుండా పోతున్నదన్న విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా అర్చక డ్యూటీల విషయంలో అధికారి, సీనియర్ ఉద్యోగి వత్తాసుతో అర్చకుడు గర్భగుడిలో విధులు నిర్వర్తిస్తున్నారని, నిబంధనలకు విరుద్ధంగా తాము నిర్ణయించుకున్న పద్ధతిని వదిలేసి మిగతా అర్చకులపై పెత్తనం చెలాయిస్తూ గర్భగుడిలో డ్యూటీలు చేస్తున్నారని కొందరు భక్తులు చెప్పారు.
తాము ఇచ్చే విరాళాలు దేవాలయ హుండీలో కానీ, ఆలయ ఖాతాలోకి చేరుతున్నాయా లేదా అనే అనుమానం కూడా ఉన్నదని, ఈ విషయంలో ఈ అధికారం లేని అధికారికి చెప్పినా.. ఆయన నవ్వి ఊరుకుంటున్నారని వారు చెప్పారు. అర్చకుల డ్యూటీల విషయంలో తానేం మాట్లాడనని చెప్పిన ఆలయ అధికారి.. బహిరంగంగానే తన లావాదేవీల కోసం ఆ అర్చకుడికి వత్తాసు పలుకుతూ మిగతావారిని వేధిస్తున్నారని ఎండోమెంట్ ప్రధాన కార్యాలయానికి ఫిర్యాదు కూడా వచ్చింది.
ఈ విషయంలో ఉన్నతాధికారులు ఏదైనా మాట్లాడితే మంత్రితో ఎందుకొచ్చిన గొడవ అనుకుంటున్నారని, ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోతే ఆలయంలో ఉన్న బంగారం కూడా ఈ అధికారి హయాంలో మాయమయ్యే అవకాశాలున్నాయని భక్తులు చెబుతున్నారు. ఈ అధికారి వ్యవహారంపై విచారణ జరిపి ఓ సీనియర్ ఆఫీసర్‌కు దేవాలయ అధికారిగా బాధ్యతలు ఇచ్చి ఆలయ నిర్వహణ గాడిలో పడేలా చేసి అమ్మవారి బంగారానికి భద్రత కల్పించాలని భక్తులు, దాతలు డిమాండ్ చేస్తున్నారు.