సుల్తాన్‌బజార్, ఆగస్టు 23: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన సీపీఎస్ రద్దు హామీని తక్షణమే అమలు చేసి జీవో నెంబర్ 28ను రద్దు చేయాలని కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం అబిడ్స్‌లోని బీమా భవన్ ఆవరణలోని సీపీఎస్ స్టేట్ నోడల్ ఆఫీస్ వద్ద సంఘం హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు నాగులవంచ నరేందర్‌రావు ఆధ్వర్యంలో ఆగస్టు 23న బ్లాక్ డేగా పరిగణిస్తూ నల ్లదుస్తులు ధరించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన సంఘం నాయకులతో కలిసి జీవో నెంబర్ 28 ప్రతులను దహనం చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ పెట్టుబడిదారి పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని కోరారు. సీపీఎస్ ఉద్యోగుల డీఏ, ఏరియర్స్ని ఈఎంఐ పద్ధతిలో కాకుండా, ఏక మొత్తంలో చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆగస్టు 23న తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 28 రాష్ట్రంలోని సుమారు 2 లక్షల 50 వేల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఉరితాడుగా మారిందని అన్నారు. సంఘం హైదరాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడు నాగులవంచ నరేందర్‌రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని కోరారు.
ఇతర రాష్ర్టాలలో పాత పెన్షన్‌ను పునరుద్ధరించినట్లే తెలంగాణలోనూ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 28తో సీపీఎస్ విధానాన్ని అమలు చేసిన రోజైన ఆగస్టు 23ను బ్లాక్ డేగా నిర్వహించామని చెప్పారు. తక్షణమే సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, కోశాధికారి నరేష్‌గౌడ్, జిల్లా కార్యదర్శి సత్యనారాయణ, జిల్లా కోశాధికారి శ్యామ్ సుందర్, ఉపాధ్యక్షుడు ఎన్.శ్రీనివాస్, కార్యనిర్వాహణ కార్యదర్శి శివకుమార్, కార్యవర్గ సభ్యులు అరవింద్,సుధాకర్, రమేష్, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.