Desilting | సిటీబ్యూరో, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ ) :రాబోయే వర్షాకాలంలో వరద ముంపు తప్పదా? కాలనీలు, బస్తీలు వరద నీటిలో మునగాల్సిందేనా? అంటే అవుననే సమాధానం వస్తున్నది. ప్రతి ఏటా జనవరి నుంచే ప్రారంభం అయ్యే డీసిల్టింగ్ (పూడికతీత) పనులు ఈ సంవత్సరం ఫిబ్రవరి నెల ముగుస్తున్నా.. కనీసం నాలాల పూడికతీత పనులు మొదలు కాలేదు. ఒకటి, రెండు చోట్ల తాజాగా టెండర్లు పిలిచిన అధికారులు దాదాపు వందలాది చోట్ల పనులకు టెండర్లు పిలవకపోవడం అధికారుల పనితీరుకు అద్దం పడుతున్నది. ప్రతి ఏడాది దాదాపు రూ.60 కోట్ల మేర నాలా పూడికతీత పనులకు టెండర్లు పిలిచి వర్షాకాలం తొలకరి జల్లులు కురిసే నాటికల్లా పూడికతీత పనులను పూర్తి చేసి వరద నీరు సాఫీగా వెళ్లేందుకు చర్యలు చేపట్టాలి.
కానీ ఘనత వహించిన జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ నిర్వహణ విభాగం మీనమేషాలు లెక్కిస్తున్నది. అసలే ఆర్థిక కష్టాలు…ఆపై రూ.1400కోట్ల బకాయిలు చెల్లించాలంటూ కాంట్రాక్టర్ల హెచ్చరికలు…జీహెచ్ఎంసీ పనులంటేనే హడలిపోతున్న కాంట్రాక్టర్లతో ముందస్తు ప్లాన్‌తో వెళ్లాల్సిన ఇంజినీరింగ్ విభాగం నాలా పూడికతీత పనులను ఇప్పటి వరకు ప్రారంభించలేదు. డిసెంబర్లో పనులకు టెండర్లు పిలిచి జనవరిలో ప్రారంభించి మే నెలాఖరు కల్లా పూర్తి చేయాల్సిన చోట …నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. దీనికి తోడు ఎస్ఎన్డీపీ మొదటి దశను ఇంకా పూర్తి చేయలేకపోవడం ..పూడికతీత పనులు చేపట్టకపోవడం పట్ల ప్రజల్లో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా లోతట్టు ప్రాంత ప్రజలు అధికారుల తీరుపై మండిపడుతున్నారు.
కేవలం 81 శాతం..
జీహెచ్ఎంసీ పరిధిలో వరద నీటి కాలువల పొడవు 1302 కిలోమీటర్ల మేర ఉండగా…390 కిలోమీటర్లు మేజర్ నాలా, మైనర్ డ్రైయిన్స్ 912 కిలోమీటర్లు మేర ఉన్నాయి. ప్రతి ఏటా మాదిరిగానే వరద నీరు సాఫీగా దిగువకు వెళ్లేందుకు పునరుద్ధరణ, మరమ్మతు చర్యలు చేపడుతున్నారు. ఇందుకోసం ఏటా రూ. 50 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు. అయితే పనులను సకాలంలో జరపకుండా వరద నీటి ముంపునకు అధికారులు కారణమవుతున్నారు. ప్రతి ఏటా వర్షాకాలం ప్రారంభం నాటికల్లా పూర్తి కావాల్సిన పనులను 80శాతమే పూర్తి చేసి తొలకరి జల్లు నాటికి పూడికతీతను వర్షార్పణం చేస్తున్న దాఖలాలు ఉన్నాయి. ఇందులో భాగంగానే 2024 సంవత్సరంలో 3.12 లక్షల క్యూబిక్ మీటర్ల పూడికను తీసి 81 శాతం పనులతో ముగించారు. రికార్డుల్లో మాత్రం ఐదు లక్షల క్యూబిక్ మీటర్ల పూడిక తీస్తున్నట్లు లెక్కలు చూపిస్తూ పనుల పారదర్శకతకు పాతర వేస్తుండడం గమనార్హం.