హైడ్రా చేపట్టిన మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్‌లకు సంబంధించిన టెండర్ల ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ కాంట్రాక్టర్లు ఆరోపించారు. ఈ మేరకు సోమవారం హైడ్రా కార్యాలయం సమీపంలో మాన్సూన్ టెండర్లకు దరఖాస్తులు ఇచ్చి తిరస్కరించబడిన కాంట్రాక్టర్లు ఆందోళనకు దిగారు. హైడ్రా 2026 వర్షాకాలం కోసం మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్‌కు వాహనాలు, లేబర్ సమకూర్చుకోవడం కోసం పిలిచిన టెండర్లలో రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది కాంట్రాక్టర్లు పనుల కోసం దరఖాస్తు చేసుకున్నామని తెలంగాణ బ్యాక్వర్డ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గుంటి సాయికిరణ్ తెలిపారు.
సిటీబ్యూరో, జూన్ 15(నమస్తే తెలంగాణ): హైడ్రాలో కొందరు అధికారులు, కొంతమంది కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ఒక్కొక్క ఏజెన్సీకే ఐదు లేదా ఆరు పనులు కట్టబెట్టారని, ముఖ్యంగా టెండర్ల ప్రక్రియలో చాలా అవకతవకలు జరిగాయని తెలంగాణ బ్యాక్వర్డ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గుంటి సాయికిరణ్ ఆరోపించారు. ఈసారి 62 టెండర్లు పిలిచారని, నిబంధనల ప్రకారం ఒక్కొక్క ఏజెన్సీకి కేవలం ఒక వర్క్ మాత్రమే కేటాయిస్తే అర్హత కలిగిన చాలామంది కాంట్రాక్టర్లకు అవకాశం దక్కుతుందని..కానీ అలా కాకుండా కేవలం కొన్ని ఏజెన్సీలకే ఎక్కువ పనులు కట్టబెట్టారని సాయికిరణ్ తెలిపారు.
ఒక డివిజన్లో ఒక కాంట్రాక్టర్‌కు పని కేటాయిస్తే ఐదు ఆటోలు పెట్టుకుని ఎలాంటి ఇబ్బందిలేకుండా స్థానిక సిబ్బందితో కలిసి పనిచేస్తారని, దాంతో స్థానికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరుగుతుందని మరో కాంట్రాక్టర్ చెప్పారు. కానీ అలా కాకుండా ఒక్క ఏజెన్సీకే ఐదారు పనుల చొప్పున అప్పగించడం వల్ల మళ్లీ వరద సమస్య వచ్చే అవకాశం ఉందని వారు చెప్పారు. గత సంవత్సరంలో తిరస్కరించిన వారికి కూడా పనులు కట్టబెట్టారని, అదే సంవత్సరం తమకు పనులు ఇచ్చి బాగా చేశామంటూ సర్టిఫికెట్ ఇచ్చి ఇప్పుడు తమ పత్రాలు సరిగా లేవంటూ తిరస్కరించడం ఎంతవరకు సమంజసమని కాంట్రాక్టర్లు ప్రశ్నిస్తున్నారు. గత సంవత్సరం టెండర్ల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించారని, ఈసారి అర్హులైన కాంట్రాక్టర్లను సాంకేతిక కారణాలతో తిరస్కరిస్తున్నారని చెప్పారు.
టెండర్ నిబంధనల ప్రకారం పనులకు అవసరమైన వాహనాలను సరఫరా చేయడానికి తాను టాటాఏస్ కంపెనీ వారితో ఒక ఒప్పందం కుదుర్చుకున్నానని ఆ పత్రాలు టెండర్ సమయంలో సమర్పించామని తెలిపారు. టెండర్లు తెరిచిన తర్వాత పనులు కేటాయించే సమయంలో ఒప్పందం ప్రకారం కొత్త వాహనాలు అందుబాటులోకి వస్తాయని, ఒకవేళ ఆసమయంలో రాకపోతే వేరే వాహనాలను కూడా సిద్దం చేశానంటూ టెండరు దాఖలు సమయంలోనే తాను హామీ ఇచ్చానని చెప్పారు.
గత సంవత్సరం ఇదే విధంగా తాను టెండర్‌కు దరఖాస్తు చేసుకుంటే తనకు హయత్‌నగర్ సర్కిల్లో పనులు ఇచ్చి పూర్తయిన తర్వాత బిల్లులు కూడా ఇచ్చారని, ఈసారి మాత్రం వాహనాల పత్రాలు సరిగా లేవంటూ సాకు చూపి తన ఏజెన్సీతో పాటు చాలామంది కాంట్రాక్టర్ల టెండర్లను తిరస్కరించారని ఆయన ఆరోపించారు. ఈ విషయాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినా ఆయన అందుబాటులో లేరని, మిగతా అధికారులతో మాట్లాడదామంటే వారుకూడా పట్టించుకోలేదని, తమ వినతి పత్రాన్ని కనీసం ఇన్‌వార్డులో ఇద్దామన్నా కూడా ఆ అప్లికేషన్‌ను తీసుకోకుండా కార్యాలయం నుంచి బయటకు పంపించారంటూ కాంట్రాక్టర్లు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇచ్చిన టెండర్లు రద్దు చేసి షార్ట్ టెండర్లు పిలిచి పారదర్శకంగా టెండర్ ప్రక్రియ కొనసాగించాలని ఆందోళనకు దిగిన కాంట్రాక్టర్లు డిమాండ్ చేశారు.
అవకతవకలు అవాస్తవం: హైడ్రా
మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్‌ల ఎంపిక పారదర్శకంగా జరిగిందని హైడ్రా సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. టెండర్ల ప్రక్రియలో అవకతవకలు జరిగినట్లు అవకాశం లభించని కాంట్రాక్టర్లు చేసిన ఆరోపణలను హైడ్రా ఖండించింది. మొత్తం రూ.65కోట్ల విలువైన 62 టెండర్లను వర్షాకాల అత్యవసర పనుల కోసం హైడ్రా ఆహ్వానించింది. వీటిలో 44 టెండర్లను తెరవగా, ఇందులో 4 అర్హత సాధించలేదని హైడ్రా పేర్కొంది. మిగిలిన 40 టెండర్లలో 18 మంది అర్హత సాధించారని, వర్షాకాలం ఆరంభమవ్వడం, అత్యవసర పనుల దృష్ట్యా అర్హత సాధించని నాలుగుచోట్ల టెండరు ప్రకటన మళ్లీ ఇచ్చామని తెలిపింది. మరో 22 టెండర్ల దరఖాస్తులను పరిశీలించి ఖరారు చేయాల్సి ఉందని, ఇందులో మరింత మందికి అవకాశం లభించనున్నట్లు హైడ్రా అధికారులు చెప్పారు.
ఇటువంటి పరిస్థితుల్లో కేవలం 5 సంస్థలకే టెండర్లు కట్టబెట్టారని ఆరోపించడంలో ఎలాంటి వాస్తవం లేదని హైడ్రా తన ప్రకటనలో పేర్కొంది. కాంట్రాక్టర్ల అనుభవం, సన్నద్ధత, అవసరమైన వాహనాలు, సిబ్బంది సామర్థ్యాన్ని ప్రామాణికంగా తీసుకుని ముగ్గురు ఎస్ఈలు, తొమ్మిదిమంది అధికారులతో కూడిన బృందం ఈ ఎంపిక ప్రక్రియను చేపట్టింది.దీనితో పాటు హైడ్రా పరిధి విస్తరణ, విపత్తు నిర్వహణ సామర్ధ్యాన్ని పెంచేందుకు వీలుగా 140 అదనపు వాహనాలు, అత్యాధునిక పరికరాల కొనుగోలుకు రాష్ట్రప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ కొత్త కొనుగోళ్లలో భాగంగా 21 డీఆర్ఎఫ్ ట్రక్కులు, 2 ఇన్నోవా హైక్రాస్ వాహనాలు, 1 ఇన్నోవాక్రిస్టా, 54 మహేంద్రాస్కార్పియో వాహనాలు, 2 ట్రూప్ క్యారియర్ వ్యాన్లు, 2 బస్సులు, 37 బైకులను కొనుగోలు చేయనున్నట్లు సమాచారం. వీటితోపాటు రెస్క్యూ ఆపరేషన్ల కోసం 21 అత్యాధునిక డీఆర్ఎఫ్ ఎక్విప్మెంట్ యూనిట్లను కూడా కొనుగోలు చేస్తున్నారు. ఈ కొత్తవాహనాలు, పరికరాల కొనుగోలు అయ్యే మొత్తం వ్యయాన్ని 2026-27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ నుంచి భరించడానికి ప్రభుత్వం అనుమతించింది.