Shamshabad | శంషాబాద్ రూరల్, ఏప్రిల్ 20 : శంషాబాద్ మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ లోపం.. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శంషాబాద్ పరిధిలోని17వ వార్డు సిద్ధాంతి ముదిరాజ్ బస్తీలో ఇటీవల రూ.25 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు మూడు రోజుల ముచ్చటగా మారింది.
సిద్దాంతి ముదిరాజ్ బస్తీలో ఇటీవలే సీసీ రోడ్డును నిర్మించారు. ఆ రోరడ్డు నిర్మాణం సమయంలో దాని పర్యవేక్షణను మున్సిపల్ అధికారులు అస్సలు పట్టించుకోలేదు. దీంతో కాంట్రాక్టర్ తనకు నచ్చినట్టుగా రోడ్డును వేశారు. రోడ్డును ఎగుడుదిగుడుగా నిర్మించారు. మ్యాన్‌హోల్స్‌ను కూడా సరిగ్గా ఏర్పాటు చేయలేదు. ఫలితంగా వర్షం పడినప్పుడు నీరు మ్యాన్‌హోల్స్‌కు బదులు రోడ్డు పక్కన ఉన్న ఇండ్లలోకి వెళ్తున్నది. లేదంటే రోడ్డుపైనే వరద నీరు నిలిచిపోతున్నది. దీనిపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు నిర్మాణం చేసే సమయంలోనే కాంట్రాక్టర్‌కు, అధికారులకు ఈ సమస్య గురించి చెప్పామని.. అయినప్పటికీ వారు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి వర్షానికే ఇలా ఉంటే.. భారీ వర్షాలు పడినప్పుడు మా పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చొరవతీసుకుని సమస్యను పరిష్కరించాలని కోరారు. అలాగే సీసీ రోడ్డు నిర్మాణంలో నిర్లక్ష్యం వహించిన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.