కవాడిగూడ, సెప్టెంబర్ 3: ట్యాంక్‌బండ్‌పైన వినాయక నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని యదావిధిగా కొనసాగించాలని, వినాయకులను వేసేందుకు అడ్డుగా ఉన్న బారీకేడ్లను, జాలీలను వెంటనే తొలగించాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి శశిధర్ డిమాండ్ చేశారు. వినాయక చవితి మహోత్సవాలలో భాగంగా ప్రతి సంవత్సరం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే నిమజ్జనోత్సవ కార్యక్రమానికి ట్యాంక్‌బండ్‌పై క్రేన్లు ఏర్పాటు చేయడంతో పాటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అన్నారు.
ట్యాంక్‌బండ్ వినాయక సాగర్‌లోనే సామూహిక వినాయక నిమజ్జనోత్సవాన్ని కొనసాగించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో బుధవారం ట్యాంక్‌బండ్‌పై ఆందోళన చేపట్టారు. ట్యాంక్‌బండ్ రెయిలింగ్‌కు ఏర్పాటు చేసిన భారీ కేడ్లను భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు బలవంతంగా తొలగించారు. ఈ క్రమంలో పోలీసులకు ఉత్సవ సమితి ప్రతినిధులకు మధ్యన వాగ్వదం తోపులాట చోటుచేసుకున్నాయి. దీంతో కొద్ది సేపు ట్యాంక్‌బండ్‌పై ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.
పోలీసులు వెంటనే ఆందోళనకు దిగిన ఉత్సవ సమితి ప్రతినిధులను కార్యకర్తలను అరెస్టు చేసి ఆయా పోలస్ స్టేషన్లకు తరలించారు. అనంతరం భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిథులు శశిధర్, ఆలెభాస్కర్, నాయిని బుచ్చిరెడ్డి, సంజయ్గణాటేలు మాట్లాడుతూ నిమజ్జనోత్సవానికి ట్యాంక్‌బండ్‌పై ఇప్పటి వరకూ ఎలాంటి ఏర్పాట్లను ప్రభుత్వం చేయకపోవడం హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని మండిపడ్డారు.
ప్రభుత్వం ఏర్పాట్లు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో వినాయక నిమజ్జనాలకు వచ్చే భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత 45 సంవత్సరాలుగా ట్యాంక్‌బండ్‌లో వినాయక నిమజ్జనోత్సవాలు నిరాటంకంగా జరుగుతున్నాయని దీన్ని అడ్డుకుంటామంటే సహించేది లేదని తేల్చి చెప్పారు.
కోర్టు ఉత్తర్వుల ప్రకారం నడుచుకోవాలంటే నిమజ్జనాలు జరగడం చాలా కష్టమని చెప్పారు. ప్రభుత్వం వెంటనే వినాయక నిమజ్జనోత్సవాలకు ట్యాంక్‌బండ్‌పై ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. లేనట్లియితే మండపాల నుంచి వినాయకులను తరలించకుండా ఎక్కడికక్కడ స్థంభింపచేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నాయకులు వినయ్‌కుమార్, మహేందర్‌బాబు, శక్తి సింగ్, సలంద్రి శ్రీనివాస్‌యాదవ్ తదితర ఉత్సవ సమితి నాయకులు పాల్గొన్నారు.