మేడ్చల్ రూరల్, ఏప్రిల్ 26: గుండ్లపోచంపల్లి చెరువులో కలుషిత నీరు చేరి చేపపిల్లలు మృతి చెందాయి. గుండ్లపోచంపల్లి డివిజన్ పరిధిలోని నీళ్ల చెరువుపై ఆధారపడి సుమారు 70 మత్స్యకారుల కుటుంబాలు జీవిస్తున్నాయి. కాగా ఆదివారం తెల్లవారుజామున చెరువులో చేపలు మృతి చెంది నీళ్లపై తేలాయి. చెరువు వద్దకు మత్స్యకారులు వెళ్లి చూసి తమ గోడును పట్టించుకునే వారే లేరని ఆవేదన వ్యక్తం చేశారు. చెరువు చుట్టూ ఏర్పడిన విల్లాలు, ఆపార్ట్మెంట్ల నుంచి డ్రైనేజీ నీరు, కొన్ని పరిశ్రమల నుంచి కలుషిత నీరు వచ్చి చెరువులో చేరడంతో నీరు కలుషితమై చేపలు చనిపోయాయని మత్స్యకారుల సంఘం నాయకులు హన్మంత్, నర్సింహ ఆరోపించారు.
చేపలు చనిపోవడంతో సుమారు రూ.20 లక్షల నష్టం వాటిల్లిందని తెలిపారు. డ్రైనేజీ, కలుషిత నీరు చెరువులోకి వచ్చి చేరడంతో నీరు పచ్చగా మారిందని, ఈ విషయమై అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని ఆరోపించారు. ఇప్పటికైనా రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్, కాలుష్య నియంత్రణ శాఖ అధికారులు స్పందించి చెరువులోకి కలుషిత నీరు రాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.