దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ టీజీఎస్పీడీసీఎల్ నిర్లక్ష్యం కారణంగా వినియోగదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆరేడునెలలుగా డిస్కం పరిధిలో కొత్త విద్యుత్ మీటర్ల కొనుగోలుకు ఇండెంట్ పెట్టలేదంటూ డిస్కంలో చర్చ జరుగుతుంది. గత సంవత్సరం కొనుగోలు చేసిన విద్యుత్ సామాగ్రి కొనుగోళ్లలో కూడా మీటర్లకు ప్రాధాన్యత ఇవ్వలేదంటూ ఉద్యోగులు చెప్పుకుంటున్నారు. ఇందుకు డిస్కంలో అధికారుల నిర్లక్ష్యమా లేక ఆధిపత్యపోరా.. ఇదేది కాకుండా కంపెనీలతో కుదరని ఒప్పందాలా.. ఏదేమైనా విద్యుత్ మీటర్లు సకాలంలో బిగించకపోవడంతో వినియోగదారుడి జేబులకు చిల్లులు పడుతున్నాయి. యావరేజ్ బిల్లుల పేరుతో అధికంగా వసూలు చేస్తున్నారంటూ ప్రజలు వాపోతున్నారు.
-సిటీబ్యూరో, ఏప్రిల్ 5(నమస్తే తెలంగాణ)
గ్రేటర్‌లోని దక్షిణ డిస్కం మూడుజోన్ల పరిధిలో పది సర్కిళ్లలో 67లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ప్రతి సర్కిల్లో సుమారు మూడునుంచి నాలుగువేల మీటర్లు స్ట్రక్ అవడమో లేక కాలిపోవడమో జరిగి పనిచేయకుండా ఉన్నాయి. వీటిస్థానంలో కొత్త మీటర్లు బిగించాల్సి ఉండగా ఇప్పటివరకు ఇళ్ల దగ్గరకు వచ్చి బిల్లులు ఇచ్చి వెళ్తున్న సిబ్బంది నోట మీటర్ల మాటే లేదు. ఒక వినియోగదారుడి మీటర్ స్ట్రక్ అయినా లేదా కాలిపోయినా నెలరోజుల్లోపు కొత్త మీటర్ బిగించాల్సి ఉంటుంది. అటువంటి అత్యవసర పరిస్థితుల కోసం దక్షిణ డిస్కం తన పరిధిలోని సర్కిళ్లలో కొన్ని అదనపు మీటర్లను స్టాక్ ఉంచుకోవాలి. కానీ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ డిస్కం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. ఆరేడునెలలుగా మీటర్ల కొరత ఏర్పడడంతో స్ట్రక్ అయిన, కాలిపోయిన మీటర్ల స్థానంలో కొత్తవి బిగించడం లేదు. దీంతో ప్రతినెల వాడిన మేరకు యూనిట్ల రీడింగ్ తీసే అవకాశం లేక యావరేజ్ బిల్లులు ఇస్తున్నారు.
ఒక వినియోగదారుడు వినియోగకాలంలో అత్యధికం వినియోగం ద్వారా వచ్చిన బిల్లును ప్రామాణికం చేసుకుంటున్నారు. దీంతో విద్యుత్ తక్కువ వినియోగించినా యావరేజ్ పేరిట బిల్లులు మోతమోగిస్తున్నాయని వినియోగదారులు చెబుతున్నారు. మీటర్ రీడింగ్ తీయకుండా ఇలా పెద్ద మొత్తంలో బిల్లులు వేయడమేంటని, చలికాలంలో కూడా వేసవికాలంలో వచ్చిన బిల్లు వచ్చిందంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా వేస్తున్న అధిక బిల్లుల కారణంగా గృహజ్యోతి పరిధిలోకి వచ్చే లబ్ధిదారులు కూడా అధిక వినియోగం పేరుతో బిల్లులు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చిందని ఓ సర్కిల్ అధికారి చెప్పారు. అయితే మీటర్లే అందుబాటులో లేనప్పుడు తామేం చేస్తామంటూ మీటర్ రీడర్లు చెబుతుంటే సర్కిల్ కార్యాలయాల్లోనూ అదే సమాధానం చెబుతున్నారని ప్రజలు అంటున్నారు.
మీటర్ల కొనుగోలులో జాప్యం..
విద్యుత్ మీటర్లలో ఏదైనా సమస్య ఉంటే అధికారులు కానీ సిబ్బంది కానీ పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ సమస్య మాది కాదంటూ వ్యవహరిస్తున్నారే తప్ప పరిష్కారం దిశగా ఆలోచించడం లేదని వినియోగదారులు చెబుతున్నారు. దక్షిణ డిస్కం పరిధిలో పరిశ్రమలతో పాటు గృహ విద్యుత్ కనెక్షన్లు అధికంగా ఉండడం వల్ల ఇక్కడ ఎక్కువగా మీటర్లు కాలిపోవడమనేది జరుగుతుంది. గ్రేటర్ హైదరాబాద్ నగర పరిధిలో అత్యధికంగా బంజారాహిల్స్, సైబర్‌సిటీ వంటి సర్కిళ్లలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. ఓవర్‌లోడ్ కారణంగా మీటర్లు కాలిపోవడమో లేక స్ట్రక్ అవడమో జరుగుతున్నదని సిబ్బంది చెబుతున్నారు.
మీటర్లలో సమస్యలపై స్పందించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడం, అసలు మీటర్లే లేని పరిస్థితి కార్పొరేట్ ఆఫీసులో గతంలో ఎప్పుడూ లేదని మింట్‌కాంపౌండ్‌లోని ప్రధాన కార్యాలయంలోనే ముఖ్యమైన వారి వ్యవహారంలో ఏదో తేడా కనిపిస్తున్నదని ఓ సీనియర్ అధికారి అనుమానం వ్యక్తం చేశారు. మీటర్ల కోసం కొన్ని నెలలుగా ఇండెంట్ పెట్టినట్లు కనిపించడం లేదని, తాజాగా కమిటీ నియామకం అంటూ మళ్లీ మీటర్ల వ్యవహారంలో జాప్యం చేయడం తప్ప ఎక్కడా కదలిక లేదని ఆయన చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో మూడువేల కోట్ల విద్యుత్ మెటీరియల్ కొనుగోలు చేసినప్పుడు మీటర్ల కొరత ఎందుకు వచ్చిందనే ప్రశ్న తలెత్తుతోంది. మీటర్లకు ఇండెంట్ పెట్టకపోవడానికి కారణమేంటని, ఎక్కడైనా కంపెనీలు ఇచ్చే కమీషన్లలో తేడా వచ్చిందా.. లేక తమకు నచ్చిన కంపెనీలు రావడం లేదా అంటూ వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే డిస్కం యాజమాన్యం పొరపాటు చేసి ఆ భారాన్ని విద్యుత్ వినియోగదారులపై వేయడం ఎంతవరకు కరెక్టని మండిపడుతున్నారు.
మీటర్ల కొరత వాస్తవమే
డిస్కంలో కరెంట్ మీటర్ల కొరత వాస్తవమే. కరెంట్ బిల్లులు ఎక్కువగా వస్తున్నాయని, స్ట్రకప్, బర్డెన్ మీటర్లను మార్చాల్సిందిగా కోరుతూ వినియోగదారుల నుంచి అనేక విజ్ఞప్తులు వస్తున్నాయి. కొత్త కనెక్షన్ల జారీతో సహా పాడైన మీటర్లను మార్చేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాం. విద్యుత్ పరికరాల కొనుగోళ్లలో భాగంగా మీటర్ల సమీకరణకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాం.
– జితేశ్ వీ పాటిల్, సీఎండీ, టీజీఎస్పీడీసీఎల్