మలక్ పేట, మార్చి 3: మూసీ తీరంలో నిర్వాసితులతో కలిసి ప్రభుత్వంపై ఉద్యమిస్తామని నర్మదా బచావో ఉద్యమకారిణి, హక్కుల నేత మేథాపాట్కర్ హెచ్చరించారు. సోమవారం పాత మలక్ పేట డివిజన్ శంకర్ నగర్ లోని మూసీ నిర్వాసితుల కాలనీల్లో పర్యటించారు. మూసీ నిర్వాసితులకు సరైన న్యాయం జరగలేదన్న సమాచారాన్ని అందుకున్న ఆమె సోమవారం ఉదయం 8 గంటలకు మూసీ సుందరీకరణ కోసం ఇళ్లు కూలగొట్టిన కాలనీలో పర్యటించారు.
అక్కడి బాధితులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. మూసీ సుందరీకరణ పేరు తో ప్రభుత్వం తమ ఇళ్లను కూల్చివేసిందని రోదించారు. ఒక్కో ఇంట్లో మూడు నాలుగు కుటుంబాలు నివసించేవని ఇప్పుడు వారంతా దిక్కూ మొక్కు లేక నిరాశ్రయులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు, మూడు వందల గజాల స్థలంలో నిర్మించిన ఒకే ఇంట్లో రెండు, మూడు కుటుంబాలు నివసించేవని, మూసీ సుందరీకరణ పేరుతో తమ నివాసాలను కూల్చివేసిన అధికారులు, తమకు ఒకే ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించి చేతులు దులుపుకోవడంతో మిగతా రెండు, మూడు కుటుంబాలు రోడ్డున పడ్డాయని గోడును వెళ్లబోసుకున్నారు.
మూసీ నిర్వాసితులకు ఇండ్ల పరంగా కాకుండా, కుటుంబాల పరంగా లెక్క వేసి డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయించాలని కోరారు. పాత మలక్ పేట డివిజన్ లోని శంకర్ నగర్, మూసారాంబాగ్ డివిజన్ లోని అంబేద్కర్ హట్స్, అజయ్ హట్స్, జాంబవంతుని హట్స్, సాయిలు హట్స్ ప్రాంతాలు మూసీ బెడ్లో ఉన్నాయని సుందరీకరణ పేరుతో పేదల ఇండ్లను కూల్చివేశారని చెప్పారు.
నగరంలోని ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు మూడు రోజుల క్రితం వచ్చిన ఆమె, సోమవారం పాత మలక్ పేటలోని శంకర్ నగర్ నివాసం ఉంటున్న సామాజిక కార్యకర్త, మానవ హక్కుల వేదిక జంట నగరాల ఉపాధ్యక్షుడు అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలుసుకున్న ఆమె అతని ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా మూసి నిర్వాసితుల సమస్యలను అడిగి తెలుసుకున్న ఆమె, బాధితులకు న్యాయం చేకూరేలా పోరాడాలన్నారు. కాగా ఆమె పర్యటనపై సమాచారాన్ని అందుకున్న చాదర్ఘాట్ పోలీసులు వెంటనే ఆమెను అక్కడి నుంచి వెళ్లిపోవాలని పట్టుబట్టి పంపించివేశారు.