బాలానగర్, డిసెంబర్ 26 : ఫతేనగర్ డివిజన్లో వసతుల కల్పనకు ప్రజాప్రతినిధులు కృషి చేస్తున్నారు. డివిజన్లో ఇప్పటికే తాగునీరు, భూగర్భ డ్రైనేజీ, రహదారులు, శ్మశానవాటికలు, కమ్యూనిటీహాల్స్, ఓపెన్‌జిమ్‌లు, షటిల్ కోర్టులు, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఇదే తరహాలో హరిజనబస్తీలో రూ. 1 కోటి నిధులు కేటాయించి నిరుపేదల సౌకర్యార్థం సకల సౌకర్యాలతో గ్రౌండ్, ఫ్స్ట్ ఫ్లోర్‌తో మినీ ఫంక్షన్‌హాల్ నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం ఫంక్షన్‌హాల్ నిర్మాణ పనులు తుది దశలో కొనసాగుతున్నాయి. ఈ నెలాఖరు వరకు పనులు పూర్తి చేసి కొత్త సంవత్సరం కానుకగా ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు ఆ దిశగా తీవ్రంగా కృషి చేస్తున్నారు.
అన్ని వేడుకలకు వేదికగా..
ఫతేనగర్ హరిజనబస్తీలో సకల సౌకర్యాలతో మినీ ఫంక్షన్‌హాల్ నిర్మాణ పనులు తుదిదశలో కొనసాగుతుండడంతో స్థానిక ప్రజలు సంబురపడుతున్నారు. స్థానికంగా మినీ ఫంక్షన్‌హాల్ అందుబాటులోకి వస్తే బర్త్‌డే ఫంక్షన్లు, నిరుపేదల వివాహాలు సైతం జరుపుకునే విధంగా సకల సౌకర్యాలతో వసతులు కల్పిస్తున్నారు. విశాలమైన హాల్, స్టోర్ రూంతో పాటు వధూవరుల బంధువుల కోసం ప్రత్యేకంగా వేర్వేరుగా రెండు గదులు, వాష్ ఏరియా ప్రత్యేకంగా నిర్మించారు.
రూ. కోటి వ్యయంతో నిర్మాణం..
ఫతతేనగర్ డివిజన్ హరిజనబస్తీవాసుల కోరిక మేరకు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సహకారంతో రూ.1 కోటీ నిధులు కేటాయించి మినీ ఫంక్షన్‌హాల్ నిర్మాణ పనులు చేపట్టి పూర్తి చేశాం. తుది మెరుగులు మినహా అన్ని పనులు పూర్తయ్యాయి. కొత్త సంవత్సరం కానుకగా స్థానిక ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తాం. 200 చదరపు గజాల స్థలంలో నిర్మాణ పనులు చేపట్టి పనులు పూర్తి చేస్తున్నాం.
– పండాల సతీశ్‌గౌడ్, ఫతేనగర్ కార్పొరేటర్
ఈ నెలాఖరకు పనులు పూర్తి..
ఫతేనగర్ హరిజనబస్తీలో చేపట్టిన మినీ ఫంక్షన్‌హాల్ నిర్మాణ పనులు పూర్తి కావచ్చాయి. ఈ నెలాఖరు వరకు పెండింగ్ పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తాం. ప్రస్తుతం ఎలక్ట్రికల్ పనులు జరుగుతున్నాయి. త్వరలో ఆయా పనులన్నీ పూర్తి చేస్తాం.
– పవన్, ఫతేనగర్ డివిజన్ ఏఈ