సిటీబ్యూరో: గాంధీ దవాఖానలో చేపట్టిన స్టేట్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. 2024లోనే అందుబాటులోకి రావల్సిన ఈ సెంటర్ నిర్మాణ పనులు మూడేండ్లు గడిచినా.. పూర్తికాలేదు. ఖరీదైన అవయవ మార్పిడి శస్త్రచికిత్సలను పేద రోగులకు పూర్తి ఉచితంగా అందించి, వారి ప్రాణాలు కాపాడాలనే ఉద్దేశంతో నాటి కేసీఆర్ సర్కార్ గాంధీ దవాఖాన, ప్రధాన భవన సముదాయంలోని 8వ అంతస్తును అవయవ మార్పిడి శస్త్రచికిత్సల విభాగాన్ని కేటాయించింది. అత్యాధునిక వైద్యపరికరాలు, మాడ్యులర్ ఆపరేషన్ థియటర్స్తో కూడిన ఈ సెంటర్ నిర్మాణ పనులను 2023లోనే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించింది.
2022లోనే రూ. 35 కోట్లు కూడా మంజూరు చేసింది. టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి చేసింది. 2023-24 మధ్య కాలంలోనే ఈ సెంటర్ అందుబాటులోకి రావాల్సి ఉన్నది. అయితే 2023లో ప్రభుత్వం మారడం.. కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం చేయడంతో ఈ సెంటర్ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ విభాగం అందుబాటులోకి రాకపోవడంతో అవయవ మార్పిడి అవసరమైన రోగులకు నిరీక్షణ తప్పడం లేదు. ముఖ్యంగా కాలేయ మార్పిడి బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 3వేల మందికి పైగా రోగులు కాలేయ మార్పిడికోసం నిరీక్షణలో ఉన్నట్లు గణాంకాల ద్వారా తెలుస్తున్నది. గాంధీలో నిర్మిస్తున్న ఎస్టీవోసీలో భాగంగా లివర్ ట్రాన్స్‌ప్లాంట్ కేర్ యూనిట్ అందుబాటులోకి వస్తే ప్రభుత్వ దవాఖానల్లో కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలు మరింత పెరిగి, రోగుల ప్రాణాలు కాపాడే వీలుంటుంది.