సైదాబాద్, జూలై 13 : పాతబస్తీ వాహనదారుల కష్టాలను తీర్చిడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా స్ట్రాటజికల్ రోడ్ డెవలప్మెంట్ ప్రొగ్రాం (ఎస్ఆర్డీపీ) వ్యూహత్మక రహదారుల అభివృద్ధి పథకం నిధులతో చేపట్టిన సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులు నత్తనడకన నడుస్తున్నాయి. చంచల్‌గూడ ప్రభుత్వ ముద్రణాలయం చౌరస్తా నుంచి సంతోష్‌నగర్ ఒవైసీ చౌరస్తా వరకు నాలుగు లేన్ల రోడ్డును రూ. 320 కోట్ల వ్యయంతో చేపట్టిన నాలుగు కిలోమీటర్ల స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులను 2020 జూలై 23న అప్పటికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.
స్టీల్ బ్రిడ్జిలో 88 ఫిల్లర్లతో 3 కిలో మీటర్ల 382 మీటర్ల పొడవుగా, అందులో 2 కిలోమీటర్ల, 580 మీటర్ల్ల ఫ్లైవర్ కారిడార్‌గా ఏర్పాటు చేస్తున్న రెండు వైపులా ర్యాంపులతో ఇరువైపుల రాకపోకలు సాగించే విధంగా నాలుగు లేన్ల ఈ కారిడార్ నిర్మాణం ఇంక పూర్తి కాలేదు. బ్రిడ్జి పనులను రెండేళ్లలో పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ప్రకటించినప్పటికీ, నాలుగేండ్ల కాలం పూర్తికావస్తున్నప్పటికీ పనులు పూర్తి కాలేదు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
చంచల్ గూడ చౌరస్తా నుంచి సైదాబాద్ వెళ్లే మార్గంలో హోటళ్లు, దుకాణాలు ఉండి రోడ్డు ఇరుకుగా మారడంతో ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ రద్దీతో వాహనదారుల ఇబ్బందులు పడుతున్నారు. చంపాపేట, చాంద్రాయణగుట్ట వైపు వెళ్లే వాహనదారులు, ఏపీకి చెందిన వివిధ జిల్లాలకు ప్రయాణించే వాహనదారులు, చంపాపేట, కర్మన్‌ఘాట్, బీఎన్ రెడ్డి, ఐఎస్ సదన్, సైదాబాద్, చంచల్‌గూడ, ధోబీఘాట్ జంక్షన్లలో నెలకొన్న ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం వేలాది బస్సులు, వాహనాలు ఇతర జిల్లాలకు వెళ్లేందుకు ప్రధాన మార్గం కావటంతోపాటు శంషాబాద్ విమానాశ్రయం, శ్రీశైలం, కేంద్ర రక్షణ రంగ కార్యాలయాలకు వెళ్లే వారందరూ నిత్యం ట్రాఫిక్ అంతరాయంతో నరకయాతన పడుతున్నారు.
రూ. 320 కోట్ల వ్యయంతో..
స్టీల్ బ్రిడ్జి వ్యయాన్ని గత ప్రభుత్వం రూ. 320 కోట్ల వ్యయంతో చేపట్టిన పనుల వ్యయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలం తర్వాత నిర్మాణ వ్యయాన్ని మరో 523. 37 కోట్ల రూపాయలను పెంచింది. బ్రిడ్జి నిర్మాణానికి రూ. 370 కోట్లు, ఆస్తుల సేకరణకు రూ.153.37 కోట్లను, అదేవిధంగా స్టీల్, ఇతర సామగ్రి ధరలు పెరగటంతో అంచనా వ్యయాన్ని రూ. 620 కోట్లకు పెంచినప్పటికీ పనులు మాత్రం నత్తనడకన నడుస్తున్నాయి.
అలైన్మెంట్లో మార్పులు చేస్తేనే..
స్టీల్ బ్రిడ్జి అలైన్మెంట్ మార్పు నిర్మాణ పనులకు అడ్డంకులను కేంద్ర బిందువుగా మారింది. సైదాబాద్ ఏసీపీ ఆఫీస్ సమీపంలోని హనుమాన్ మందిరంపై వెళ్లే బ్రిడ్జి అలైన్మెంట్లో మార్పులు చేస్తేనే పనులు చేయాలని హిందు సంఘాలు అల్టిమేటం జారీ ఆందోళన చేయటంతో నిలిచిపోయాయి. ఆలయం వద్ద పనులను అడ్డుకుంటామని హెచ్చరించిన నేపథ్యంలో వివాదానికి దారితీయటంతో పనులను నిలిపివేశారు. అలైన్మెంట్లో మార్పు చేయకుండానే నిర్మాణం జరిగే విధంగా ప్రజా ప్రతినిధులు జోక్యం చేసుకొని అధికారుల ద్వారా రాజీ ప్రయత్నాలు చేస్తున్నారు. ఐదు ప్రాంతాల్లోనూ వివాదాలు, న్యాయస్థాన అదేశాలు ఉండటంతో ఎలా పరిష్కరించుకోవాలనే అంశంపై దృష్టి సారించారు.