సిటీ బ్యూరో, జనవరి 31 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రభుత్వ ఖాళీ స్థలాలన్నీ గృహ వ్యర్థాలతో నిండిపోతున్నాయి. ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా గృహ నిర్మాణ వ్యర్థాలతో నింపేస్తున్నారు. లారీల కొద్ది వ్యర్థాలను తరలిస్తూ గుట్టలుగా పేరుస్తున్నారు. వాటి నుంచి వచ్చే దుమ్ము, ధూళితో పరిసర ప్రాంతాలన్నీ కలుషితమవుతున్నాయి. రోడ్లకు ఇరువైపులా ఉన్న ఖాళీ స్థలాల్లోనూ వాటిని డంప్ చేయడంతో దుమ్ము, ధూళి చెలరేగి వాహనదారులు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధూళి కణాలు చేరడంతో ఆయా ప్రాంతాల్లో గాలి నాణ్యతపై ప్రభావం చూపుతున్నది.
పరిసర ప్రాంత ప్రజలు కాలుష్యం బారినపడి శ్వాసకోశ సంబంధ వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో నిర్మాణాలు ఎక్కువగా జరుగుతుండటంతో అక్కడి ఖాళీ స్థలాలన్నీ వ్యర్థాలతో నింపేస్తున్నారు. పెద్ద పెద్ద బండరాళ్లు, శిథిలాలను డంప్ చేసి చదును చేస్తున్నారు. ఈ తతంగమంతా రాత్రిళ్లు గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్నది. టిప్పర్లు, లారీలతో రాత్రి సమయాల్లో ఎక్కడి నుంచో తీసుకొచ్చి శివార్లలోని ప్రభుత్వ స్థలాలతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ వ్యక్తుల మధ్య వివాదాలతో పడావు ఉన్న భూముల్లో గుట్టగుట్టలుగా డంప్ చేసి చదును చేస్తున్నారు.
ఆదేవిధంగా నిర్మాణాల నుంచి వచ్చే సిమెంట్ కాంక్రీట్ వ్యర్థాలను కూడా ఆయా ప్రాంతాల్లో పారబోస్తున్నారు. ఇంత జరుగుతున్నా జీహెచ్ఎంసీ, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. నిర్మాణ వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడానికి జీహెచ్ఎంసీ ఇంటింటి వ్యర్థాల సేకరణ చేస్తున్నామని చెబుతున్నా.. అది పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. అటు కాలుష్య నియంత్రణ మండలి, జీహెచ్ఎంసీ కోట్లాది రూపాయల నిధులు ఖర్చు చేస్తున్నా నిర్వహణను గాలి కొదిలేయడంతో ప్రజాధనం వృథా అవుతున్నది.
నిర్వహణ గాలికొదిలిన అధికారులు..
నిర్మాణ వ్యర్థాల నిర్వహణ కోసం నగర శివార్లలోని జీడిమెట్ల, ఫతుల్లాగూడ, శంషాబాద్, తుమ్మలకుంటలో నాలుగు కూల్చివేత, నిర్మాణ వ్యర్థాల నిర్వహణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిని రాంకీ ఎన్విరో ఇంజినీర్స్ భాగస్వామ్యంతో నిర్వహిస్తున్నారు. ఈ నాలుగు కేంద్రాల్లో వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి ఇటుకలతో పాటు ఇతర నిర్మాణ సామగ్రిని తయారు చేస్తారు. నగరంలోని నిర్మాణ, కూల్చివేత వ్యర్థాలు జీహెచ్ఎంసీకి అందించడానికి ప్రత్యేకమైన టోల్ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేశారు. ఇలా వ్యర్థా సేకరణకు అయ్యే ఖర్చును కాలుష్య నియంత్రణ మండలి, జీహెచ్ఎంసీ సంయుక్తంగా వెచ్చిస్తారు.
ఎవరైనా వ్యర్థాలను నాలాలు, చెరువులు, ఫ్లైఓవర్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో పారబోస్తే జరిమానాలు కూడా విధిస్తారు. గ్రేటర్ పరిధిలో జరుగుతున్న నిర్మాణాల నుంచి ఉత్పత్తి అవుతున్నా.. టన్నుల కొద్దీ వ్యర్థాలను ఖాళీ స్థలాల్లో డంపు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. హైరేజ్ అపార్ట్మెంట్ల బిల్డర్లు కూల్చివేత, నిర్మాణ వ్యర్థాలను జీహెచ్ఎంసీకి అప్పగించుకుండా యథేచ్ఛగా బహిరంగ ప్రదేశాల్లో పారబోస్తున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బహిరంగ ప్రదేశాల్లో పారబోయడం వల్ల గాలి, నేల కాలుష్యం పెరిగిపోయి పర్యావరణానికి హాని కలుగుతున్నా కాలుష్య నియంత్రణ మండలి నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నది. రెండు జీహెచ్ఎంసీ, పీసీబీ అధికారులు ఇప్పటికైనా దృష్టి పెట్టి వ్యర్థాల పారబోతను నియంత్రించాలని పరిసర ప్రాంతాల ప్రజలు, పర్యావరణ ప్రేమికులు సూచిస్తున్నారు. ఏటా కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నా వ్యర్థాల నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో ప్రజాధనం వృథా అవుతూ కాలుష్యం పెరిగిపోతున్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శివారు ప్రాంతాల్లో నిఘా ఉంచి నిర్మాణ వ్యర్థాలను పారబోసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.