బేగంపేట్, సెప్టెంబర్ 26 : నియోజకవర్గ ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. పేద, మధ్యతరగతి ప్రజల సౌకర్యార్థం బేగంపేట్ పాటిగడ్డలో నిర్మించిన మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్‌ను మంగళవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ… రూ.15 వేల అద్దెతో ఈ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో శుభకార్యాలు నిర్వహించుకునే విధంగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. లక్షలు పెట్టి ప్రైవేట్ ఫంక్షన్ హాల్స్‌ను ఆశ్రయించకుండా అతి తక్కువ ఖర్చుతో పేద మధ్య తరగతి ప్రజలు శుభకార్యాలు చేసుకునేందుకు వీలు కల్పించామన్నారు. ఫంక్షన్ హాలులో అవసరమైన 40 లక్షల వరకు విలువ చేసే టెంట్‌హౌజ్ సామగ్రిని తానే స్వయంగా సమకూర్చనున్నట్టు మంత్రి తెలిపారు.
రాష్ట్రంలో 50 ఏండ్లుగా ఉన్న సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద మనస్సుతో 9 ఏండ్లలో పరిష్కరించారని చెప్పారు. ఇప్పటికే బేగంపేట్‌లో దీర్ఘకాలిక సమస్యలైన నాలాల అభివృద్ధి , శ్మశాన వాటిక, ముస్లిం గ్రేవ్‌యార్డ్, సిమెంట్ రోడ్డు, తాగునీరు, విద్యుత్ లాంటి సమస్యలను పరిష్కరించిన విషయాన్ని గుర్తు చేశారు. బేగంపేట్‌లోని ముస్లిం గ్రేవ్‌యార్డ్ అభివృద్ధి పనులు కూడా జరుగుతున్నాయని, త్వరలోనే పనులు పూర్తి చేసి ప్రారంభిస్తామని తెలిపారు. బేగంపేట్ పాటిగడ్డలో గతంలో పేదల కోసం నిర్మించిన ఇండ్లు శిథిలావస్థకు చేరుకోవడంతో వాటి మరమ్మతుల కోసం రూ.10 కోట్లు ప్రభుత్వం కేటాయించనుందని చెప్పారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి తలసాని సాయికిరణ్, కార్పొరేటర్లు మహేశ్వరి, కొలన్ లక్ష్మి, హేమలత, మాజీ కార్పొరేటర్లు అరుణగౌడ్, ఉప్పల తరుణి, ఆకుల రూప, కిరణ్మయి, నాయకులు శ్రీహరి, నరేందర్‌రావు, డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, శేఖర్ ముదిరాజ్, అక్బర్, మహ్మద్ అఖిల్ హమ్మద్ తదితరులు పాల్గొన్నారు.
7 కోట్లతో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణం..
బేగంపేట్ పాటిగడ్డలో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్‌ను సుమారు రూ.7 కోట్లతో నిర్మించారు. గత సంవత్సరం మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. మొత్తం 12,780 చదరపు అడుగుల విస్తీర్ణంలో జీ ప్లస్ 2గా ఈ ఫంక్షన్ హాల్‌ను నిర్మించారు. గ్రౌండ్ ఫ్లోర్‌ను పూర్తిగా పార్కింగ్‌కు కేటాయించారు. మొదటి అంతస్తులో డైనింగ్ హాల్ రెండో అంతస్తులో శుభాకార్యాలు చేసుకునేందుకు హాల్ నిర్మించారు. ఈ భవనానికి రెండు లిఫ్టులు ఏర్పాటు చేశారు.